
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పీహెచ్సీ 30 పడకల ఆస్పత్రిగా మారనుందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11.26 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. బుధవారం పెబ్బేరు మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో నిర్మించనున్న 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలకు భూమిపూజ చేశారు. పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను ఒప్పించినట్లు తెలిపారు. త్వరలో ఆర్డీవో, పోలీస్ సర్కిల్ ఆఫీస్‌లను తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
మున్సిపల్ అధికారులపై ఆగ్రహం
పెబ్బేరు మున్సిపల్ ఆఫీస్‌లో అడిషనల్కలెక్టర్ యాదయ్యతో కలిసి అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పెబ్బేరు–వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయినవారి వివరాలపై మేనేజర్ గణేశ్బాబును ఆరా తీయగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేయకపోవడంపై సమాచారం ఎందుకివ్వలేదని ఏఈ చంద్రశేఖర్‌ను మందలించారు. వారికి నోటీసులులిచ్చి, వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చూడాలన్నారు.
హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
ఖిల్లాగణపురం, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఖిల్లా గట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారిలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు రాయితీ రుణాల చెక్కులు అందించారు.