స్కూల్ ​అకడమిక్​ క్యాలెండర్​ రిలీజ్​ చేయని సర్కార్​

స్కూల్ ​అకడమిక్​  క్యాలెండర్​ రిలీజ్​ చేయని సర్కార్​
  • బడులు  ప్రారంభమై 10 రోజులైనా 
  • పట్టించుకోని ప్రభుత్వంఈ సారి టెన్త్​ పేపర్లపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర సర్కార్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభమై పది రోజులవుతున్నా..అకడమిక్ క్యాలెండర్​ను సర్కార్ రిలీజ్ చేయలేదు. దీంతో 2022–23 అకడమిక్ ఇయర్​లో ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి.. ఏ పరీక్షలు ఎప్పుడెప్పుడు ఉంటాయనే విషయంపై టీచర్లలో అయోమయం నెలకొంది. అయితే ఇంటర్​ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం గాకముందే, ఆ శాఖ అకడమిక్ క్యాలెండర్​ను రిలీజ్​ చేసింది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్​లో మాత్రం బడులు తెరిచినా, ఇంకా క్యాలెండర్ విడుదల చేయలేదు.  

పట్టించుకోని విద్యాశాఖ

స్టేట్ వైడ్​గా 40,898 స్కూళ్లుండగా, వాటిలో 60 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో దాదాపు 4 లక్షలకు పైగా టీచర్లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. బడులు ఎప్పుడు తెరుచుకుంటాయి.. పండుగ సెలవులు ఎప్పుడు.. ఎన్ని రోజులు.. ఏయే ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి.. ఏ నెలలో ఎన్ని పనిదినాలు... ఇలా అనేక వివరాలతో కూడిన అకడమిక్ క్యాలెండర్​ను స్కూళ్లు రీ ఓపెన్ గాక ముందే  ప్రభుత్వం ప్రకటించాలి. దాని ఆధారంగానే సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్​లతో పాటు అన్ని మేనేజ్మెంట్ల బడులు కొనసాగాలి. అంతటి ప్రాధాన్యత ఉన్న అకడమిక్ క్యాలెండర్​ను ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. 3 నుంచే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభమైంది. 13న స్కూళ్లు తెరుచుకున్నాయి. అయినా ఎలాంటి ప్లాన్ లేకుండానే బడులన్నీ నడుస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం పూర్తిస్థాయి సిలబస్​ను కొనసాగిస్తారా? టెన్త్ పరీక్షల్లో  ఆరు పేపర్లుంటాయా.. లేక 11 పేపర్లకు పెంచుతారా.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అకడమిక్ క్యాలెండర్​ కోసం టీచర్లందరూ.. ఎదురుచూస్తున్నారు. 

గతంలో వారం, పది రోజుల ముందే.. 

అన్ని స్కూల్స్​కు అకడమిక్ క్యాలెండరే మార్గదర్శకం. కరోనా కంటే ముందు ఏటా బడులు తెరిచే వారం, పది రోజుల ముందే దీన్ని రిలీజ్​ చేసేవారు. 2018–19 విద్యా సంవత్సరంలో జూన్ 1న స్కూళ్లు తెరిస్తే, మే 25న అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ ఏడాది జూన్ 4-11 వరకు బడిబాట నిర్వహించారు. 2019-20లో జూన్ 12న బడులు రీఓపెన్ కాగా, ఆ నెల 4న అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. ఆ నెల 14–19 వరకు బడిబాట కొనసాగింది. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరం మొత్తం ఆన్​లైన్​లోనే సాగింది. 2021-22లో ఫిజికల్ క్లాసులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైతే, ఆ నెల 3న అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం బడిబాట ప్రారంభమై 20 రోజులైనా ప్రకటించకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కరోనా ఎఫెక్ట్​లేకపోయినా, క్యాలెండర్ రిలీజ్ చేసేందుకు ఇబ్బంది ఏంటని టీచర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దాని ఆధారంగానే పాఠాలు చెప్పేందుకు ప్లాన్​ చేసుకునే చాన్స్​ ఉంటుందని టీచర్లు చెబుతున్నారు.