- గృహ ప్రవేశాలకు ముందే కూలిపోయేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
- కామారెడ్డి జిల్లా టెక్రియాల్‌లో నాసిరకంగా నిర్మాణాలు
- బీములకు, గోడలకు మధ్య గ్యాపులు
- ముట్టుకుంటే ఊడుతున్న బేస్‌మెంట్ రాళ్లు
కామారెడ్డి, వెలుగు: డబుల్బెడ్రూమ్ ఇండ్ల పునాదులు ప్రారంభానికి ముందే కదులుతున్నాయి. కామారెడ్డి జిల్లా టెక్రియాల్‌లో గృహ ప్రవేశాలకు ముందే గోడలు పగుళ్లు చూపుతున్నాయి. బీములకు, గోడలకు మధ్య గ్యాపులు పెరిగిపోయి, కూలిపోయే స్థితికి చేరుతున్నాయి. బేస్‌మెంట్ రాళ్లు కూడా ముట్టుకుంటే ఊడిపోతున్నాయి. ఈ ఇండ్లలోకి త్వరలోనే గృహ ప్రవేశం చేయాల్సి ఉండగా నిర్మాణాల పరిస్థితి చూసి లబ్ధిదారులు జంకుతున్నారు.
తమకు గుంట జాగ ఇస్తే గుడిసెలు వేసుకొని ఉంటాం తప్ప కూలిపోయే ఇండ్లలో ఉండలేమని తేల్చిచెబుతున్నారు.త్వరలోనే గృహప్రవేశాలు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్‌లో హైవే పక్కన 50 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. 2018లో హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్పనులు చేపట్టి 2020లో పూర్తి చేశారు. రెండేండ్లు ఖాళీగా ఉన్న తర్వాత ఏడాది క్రితమే రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ పోళ్ల నిర్మాణం లాంటి పనులు ప్రారంభించి, ఇటీవలే పూర్తిచేశారు.
మార్చిలో డ్రా తీసి, లబ్ధిదారులను ఫైనల్ చేశారు. దశాబ్ది ఉత్సవాల తర్వాత గృహ ప్రవేశాలు ఉంటాయని ఆఫీసర్లు చెప్పడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈలోగా నిర్మాణ లోపాలు బట్టబయలయ్యాయి. ఏ ఇంటికైనా బేస్‌మెంట్ కీలకం. కానీ ఇక్కడి ఇండ్లలో బేస్‌మెంట్‌కు, గోడల మధ్య గ్యాప్‌లు ఏర్పడ్డాయి. గోడలకూ పగుళ్లు ఏర్పడ్డాయి. గోడల నుంచి సిమెంట్ ఇటుకలు ఊడి బయటకు వస్తున్నాయి. కొన్ని ఇండ్ల డోర్ల వద్ద సిమెంట్ పెచ్చులు ఊడిపోతున్నాయి. కరెంటు వైర్ల బోర్డులు బయటకు వచ్చి వేలాడుతున్నాయి. మెట్లు కూడా నెర్రెలుపెట్టాయి. ప్రధానంగా బీములకు, గోడలకు మధ్య గ్యాప్రావడంతో ఇండ్లు కూలిపోతాయేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇండ్ల క్వాలిటీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు
ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల నాణ్యతపై కామారెడ్డి జిల్లాలో పొలిటికల్‌వార్ నడుస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ.. టెక్రియాల్ వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి పనుల్లో క్వాలిటీ లేదన్నారు. బేస్‌మెంట్‌కు, గోడలకు మధ్య గ్యాప్ఏర్పడి కూలే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. దీనిపై లోకల్ ఎమ్మెల్యే, విప్ గంప గోవర్ధన్ స్పందించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు క్వాలిటీగానే ఉన్నాయని, అవసరమైతే ఇంజనీర్లతో చెప్పిస్తామని పేర్కొన్నారు. దీనికి షబ్బీర్ అలీ బదులిస్తూ తాము ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు. సోమవారం డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గరకు వస్తామని ఎమ్మెల్యే కూడా రావాలని షబ్బీర్‌అలీ అన్నారు. సోమవారం స్థానికులతో కలిసి షబ్బీర్‌అలీ మరోసారి డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించినప్పటికీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాత్రం రాలేదు.
ఎమ్మెల్యే 50 రోజులు ఈ ఇండ్లలో ఉండాలి
ఎమ్మెల్యే ఈ ఇండ్లు 50 ఏండ్ల దాకా చెక్కు చెదరవని చెప్తున్నరు. 50 ఏండ్లేమోగానీ 50 రోజులు కూడా ఉండవు. నేను సవాల్ చేస్తున్న. దమ్ముంటే ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్లు వచ్చి ఈ ఇండ్లలో 50 రోజుల పాటు ఉండాలి. అధికార పార్టీ వాళ్లు కమీషన్లకు ఆశపడి ఇలాంటి క్వాలిటీ లేని ఇండ్లు నిర్మించారు. వెంటనే ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ నుంచి పైసలు రికవరీ చేయాలి.
‑ మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
బేస్‌మెంట్ గట్టిగ లేదు
బేస్‌మెంట్ గట్టిగ లేదు. పునాది గట్టిగా లేనప్పుడు పై కప్పు ఎట్లా గట్టిగా ఉంటది. జతికి పోతున్నాయి. ఈ ఇండ్లు ఎప్పడు కూలిపోతాయో తెలియదు. సౌలత్లు కూడా లేవు. 50 గజాల స్థలం ఇస్తే అక్కడ గుడిసెలు వేస్కోని ఉంటాం.. తప్ప ఈ ఇండ్లలో మాత్రం ఉండం.
- కుంటి నీరజ, టెక్రియాల్
ఇండ్లు బాగా లేవు
డబుల్ బెడ్రూం ఇండ్లు బాగా లేవు. ఇందులో ఉంటే ప్రాణాలు పోతాయేమోనని భయమై తాంది. బేస్‌మెంట్ దగ్గర రాళ్లు ఊడిపోతు న్నాయి. గోడలు కూడా పగుళ్లు వస్తున్నాయి.
- మల్లవ్వ, స్థానికురాలు, టెక్రియాల్
పైసలిస్తే మేమే కట్టుకుందుము
ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు బాగా కట్టలేదు. గోడలు పగుళ్లు వచ్చాయి. వీటిలో ఉండాలంటే భయమైతాంది. రూ.5 లక్షలు ఇస్తే మేమే వేరే జాగల మంచిగ ఇండ్లు కట్టుకునేటోళ్లం.
- సుజాత, టెక్రియాల్
