
- ఏడాది పాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగంలో16,448 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టుల గడువు ఈ ఏడాది మార్చిలో ముగిసినప్పటికీ, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో డీఎంఈ నరేంద్రకుమార్ ప్రభుత్వానికి లేఖ రాసి ఈ పోస్టులను కొనసాగించాలని కోరారు.
దీంతో 2026 మార్చి 31 వరకు ఈ పోస్టులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల్లో 4,772 కాంట్రాక్ట్ సర్వీసెస్, 8,615 ఔట్ సోర్సింగ్, 3,056 గౌరవ వేతనం ఆధారిత పోస్టులు, 5 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. ప్రొఫెసర్ల నుంచి ప్లంబర్ల వరకు వివిధ కేడర్లలోని ఉద్యోగులు ఈ పోస్టుల్లో కొనసాగనున్నారు.