
- మరో వెయ్యి కోట్లు పెరిగిన అంచనా వ్యయం
- తుది దశకు చేరుకున్న ధర్మసాగర్ మినీ టన్నెల్ రిపేర్లు
- త్వరలో అందుబాటులోకి దేవన్నపేట మూడో మోటార్
- 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే దిశగా కసరత్తు
హనుమకొండ, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 21 ఏండ్ల నుంచి పనులు కొనసాగుతుండగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ లిస్ట్ లో చేర్చి ప్రాజెక్ట్ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నేతలు పలుమార్లు రివ్యూ మీటింగ్‌లు పెట్టి పనుల పురోగతిపై ఆరా తీశారు.
ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మరో వెయ్యి కోట్లకు పెంచుతూ అధికారులు ప్రపోజల్స్ పంపించారు. కాగా, వచ్చే రెండేండ్లలో పనులన్నీ పూర్తి చేసి, ప్రాజెక్టు కింద 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఏండ్లుగా సాగుతున్న మూడో దశ..
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై 2004లో టీడీపీ హయాంలో జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 38.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదుల ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పనులు పూర్తి చేశారు. ఇందులో నర్సింగాపూర్, ధర్మసాగర్, ఆర్ఎస్ ఘన్పూర్, అశ్వరావుపల్లి, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌పల్లి తదితర రిజర్వాయర్లు నిర్మించారు.
కానీ, ప్రాజెక్టులో కీలకమైన థర్డ్ ఫేజ్ పనులు మాత్రం ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయి. 2008లో మూడో దశ పనులు ప్రారంభం కాగా.. ఇందులో రామప్ప నుంచి హసన్ పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌజ్ వరకు రూ.1,410 కోట్లతో 49.06 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. 2011 జులైలో శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్టు వద్ద బుంగ పడి ముగ్గురు కార్మికులు చనిపోగా, అప్పటి నుంచి పనులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ సర్కారు దేవాదుల ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసింది. దీంతో పదేండ్ల పాటు పనుల్లో పురోగతి లేకుండా పోయింది. ఫలితంగా మూడో దశ పనులు చేపట్టి 17 ఏండ్లు దాటినా పనులు మాత్రం కంప్లీట్ కాని పరిస్థితి నెలకొంది.
పెరిగిన అంచనా వ్యయం..
దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను 2004లో రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో అంచనా పెరుగుతూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి రూ.17,500 కోట్లకు తీసుకొచ్చారు. సకాలంలో ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం, పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
పెరిగిన ఖర్చులు, భూసేకరణ, పెండింగ్ వర్క్స్, ఇతర పనుల కోసం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17,500 కోట్ల నుంచి రూ.18,500 కోట్లకు పెంచుతూ నెల కింద ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు రూ.14,188 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేపట్టగా, మరో రూ.4,312 కోట్లు కేటాయిస్తే పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
టార్గెట్ రెండేండ్లు..
దేవాదుల ప్రాజెక్టును ఛాలెంజింగ్ గా తీసుకున్న ప్రభుత్వం వచ్చే రెండేండ్లలోనే పనులన్నీ కంప్లీట్ చేసి 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే 3.16 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తుండగా.. వచ్చే రెండేండ్లలో పెండింగ్ పనులు పూర్తి చేసి మరో 2.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తోంది. ఈ ఏడాది కొత్తగా 1,02,537 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చర్యలు తీసుకుంటోంది. పనులు పూర్తి చేసేందుకు 2,957 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా.. దానిని పూర్తి చేయడంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు.
పెండింగ్ పనులు, సమస్యలపై ఫోకస్
ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలో భాగంగా పెండింగ్ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రామప్ప నుంచి దేవన్నపేట పంప్ హౌజ్ వరకు టన్నెల్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసేందుకు దేవన్నపేట పంప్ హౌజ్ లో రెండు మోటార్లు ఆన్ చేయగా.. ధర్మసాగర్ వద్ద 208 మీటర్ల మేర నిర్మించిన మినీ టన్నెల్ లీక్ అయ్యింది.
వాటి రిపేర్లను పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదేశించడంతో మినీ టన్నెల్ రిపేర్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దేవన్నపేట పంప్‌హౌజ్‌లో మూడో మోటార్‌ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. పైపులైన్ ఎన్కేసింగ్ పనులు చేపడుతుండగా, త్వరలోనే పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
రివైజ్డ్ ఎస్టిమేషన్స్ పంపించాం..
దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రూ.18,500 కోట్లతో రీ ఎస్టిమేషన్స్ పంపించాం. ఇప్పటికే పెండింగ్ భూసేకరణపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తే గడువులోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
–అశోక్ కుమార్, సీఈ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం