గౌరవెల్లి భూసేకరణపై ఫోకస్ ..హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో కాల్వల విస్తరణ

గౌరవెల్లి భూసేకరణపై ఫోకస్ ..హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో కాల్వల విస్తరణ
  • రెండు మండలాల్లో 57 కిలోమీటర్ల మేర కెనాల్స్​ ఏర్పాటుకు చర్యలు
  • పరిహారం, కాల్వల పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు
  • భూ సేకరణకు ఇప్పటికే గ్రామసభలు పూర్తి
  • పనులు పూర్తయితే 22 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్​ నీళ్లను హనుమకొండ జిల్లాలోని భూములకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం పెండింగ్  పనులను పక్కన పెట్టగా, మంత్రి పొన్నం ప్రభాకర్  చొరవతో తొందరలోనే గౌరవెల్లి నీళ్లు జిల్లాకు చేరనున్నాయి. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్(డీ-5) విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, భూ సేకరణకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే గ్రామ సభలు కూడా పూర్తి చేశారు. భూసేకరణ, కెనాల్  వర్క్స్  కోసం ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేయగా, ఆయా పనులు  చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.

పెండింగ్  పనులపై ఫోకస్..

వైఎస్సార్​ హయాంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 1.43 టీఎంసీల కెపాసిటీతో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్  శంకుస్థాపన చేయగా.. 2015లో ప్రాజెక్టు రీడిజైనింగ్  చేసి కెపాసిటీని 8.23 టీఎంసీలకు పెంచుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో కాల్వల నిర్మాణం పూర్తి చేసి ఆయకట్టుకు సాగు నీళ్లందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా గౌరవెల్లి ప్రాజెక్టు కింద కెనాల్స్​ పనులు పెండింగ్ లో  ఉన్నాయి. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్  గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్  పనులపై దృష్టి పెట్టారు. సంబంధిత అధికారులతో పలుమార్లు సమావేశమై పెండింగ్  పనులు, భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, పెండింగ్  పరిహారం చెల్లింపుల కోసం రూ.437 కోట్లు రిలీజ్ అయ్యేలా చూశారు. దీంతోపాటు గతంలో కొందరు నిర్వాసితులు ఎన్జీటీని ఆశ్రయించగా.. ఆ సమస్య కూడా పరిష్కారం కావడంతో పనులు చేపట్టేందుకు లైన్  క్లియర్​ అయింది.

పరిహారంపై సందిగ్ధం!

డీ-5 కెనాల్  విస్తరణ కోసం భీమదేవరపల్లి మండలంలో 210.3 ఎకరాలు, వేలేరు మండలంలో 57 ఎకరాలుసేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సర్వే చేపట్టి మార్కింగ్  చేశారు. హనుమకొండ ఆర్డీవో రమేశ్  రాథోడ్, గౌరవెల్లి ప్రాజెక్టు డీఈ చైతన్య, ఇతర రెవెన్యూ ఆఫీసర్లు ఆ రెండు మండలాల్లో గ్రామసభలు నిర్వహించి, అక్కడి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలంలో 112 ఎకరాలకు అవార్డ్  చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో పలు చోట్ల బహిరంగ మార్కెట్ లో ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతుండగా, దాని ప్రకారం పరిహారం చెల్లించాలని కొందరు రైతులు డిమాండ్  చేస్తున్నారు. మరికొందరు రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో భూసేకరణ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు రైతులతో మారోసారి సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

రూ.25 కోట్లు మంజూరు..

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్  నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్  ఘన్ పూర్  నియోజకవర్గంలో 48,148 ఎకరాలతో కలిపి 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. హుస్నాబాద్  నియోజకవర్గం పరిధిలోకి వచ్చే హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో 10,508 ఎకరాలు, వేలేరు మండలంలో 11,714 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలోని ఈ రెండు మండలాల్లో 22,222 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గౌరవెల్లి డీ-5 కాల్వను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. భూసేకరణ, కెనాల్  పనుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్, మల్లారం, భీమదేవరపల్లి, నర్సింగాపురం, కొత్తకొండ, ముత్తారం, ముల్కనూరు, వంగర, మాణిక్యాపూర్, రత్నగిరి, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, పీచర గ్రామాల శివారుల్లో 60 కిలోమీటర్ల మేర కెనాల్  ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.