ఈ స్థితిలో జోక్యం చేసుకోలేం.. గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు

ఈ స్థితిలో జోక్యం చేసుకోలేం.. గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు
  • హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: గ్రూప్‌‌ 1 నియామకాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. గ్రూప్‌‌ 1 పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదని, సమగ్రతను పాటించలేదని, మూల్యాంకనంలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్‌‌ జడ్జి బెంచ్ గత నెల 9న పిటిషనర్లకు సానుకూలంగా తీర్పు వెలువరించింది. అప్పటికే ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేసింది. అలాగే పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని పేర్కొంది.

మాన్యువల్ గా రీవాల్యుయేషన్ చేసిన ఫలితాలతో పోస్ట్ లు భర్తీ చేయాలని స్పష్టం చేసింది. అయితే సింగిల్ బెంచ్  తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్టూ సెప్టెంబర్ 24న తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల (అక్టోబర్) 15కు వాయిదా వేసింది. తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చింతల పాటి ఉపేందర్, రాములు కోడెం, వి.పవన్ తోపాటు పలువురు అభ్యర్థులు గత నెల  25, 26 తేదీల్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌‌ జోయమాల్య బాగ్జితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు పరమేశ్వర్, పీఎస్ పట్వాలియా, తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ నిరంజర్ రెడ్డి, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ దేవిన సెఘల్, అడ్వకేట్ శ్రీకాంత్ వర్మ హాజరయ్యారు. తొలుత పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడంపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ వాదనలపై ప్రభుత్వ తరఫు అడ్వకేట్లు అభ్యంతరం తెలిపారు. ప్రధాన పిటిషన్లపై నెల 15న మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అలాగే నియామకాలపై స్టే ఇచ్చేందుకూ నిరాకరించింది. అయితే హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేస్తూ ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది.