నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 17 వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 17 వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ

హైదరాబాద్: నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 17 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపింది. 2026 మార్చి లోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం (జూలై 10) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది.

దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, నోటిఫికేషన్లు, ఇతర అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..  17 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు. 2026 మార్చి లోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 

ALSO READ | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, రెండు విద్యాసంస్థలకు వర్శిటీ హోదా: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్. ఈ జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి.. ఎలా ప్రిపేర్ కావాలనే గందరగోళం ఉండదు. జాబ్ క్యాలెండర్ వివరాల ప్రకారం.. ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు.