- రూ.5,560 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- రెండేండ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా చర్యలు
- ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసిన వ్యాప్కోస్!
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్హైదరాబాద్ కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి జంట హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ మంగవారం జీఓ జారీ చేశారు. గోదావరి ఫేజ్–2 స్కీమ్‌ను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది.
ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల వరకు సరఫరా చేస్తున్నారు. 2030 నాటికి తాగునీటి అవసరం 750 ఎంజీడీలకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2050 నాటికి 1,014 ఎంజీడీలకు చేరొచ్చని భావిస్తోంది. 2030 నాటికి తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో.. గోదావరి ప్రాజెక్టు ఫేజ్-– 2ను చేపట్టాలని నిర్ణయించింది.
ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ స్కీం ఫేజ్–-1 కింద సిటీ నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాటర్‌బోర్డు ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. 163 ఎంజీడీల నీళ్లు సిటీకి పంప్ చేస్తున్నారు. తాజాగా నిర్ణయంతో ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా మరో 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను.. మిగతా 5 టీఎంసీలు ఇటు మూసీ ప్రక్షాళనకు అటు జంట జలాశయాల పునరుజ్జీవానికి వాడుకోవచ్చని సర్కార్ యోచిస్తున్నది. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్ట్‌కి సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధమైంది.
వ్యాప్కోస్ సంస్థ ఈ డీపీఆర్‌ను సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్ట్‌లో భాగంగా పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైపు లైన్‌ను నిర్మించనున్నారు. అంతేగాకుండా ఘన్‌పూర్, శామీర్‌పేట్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్‌ను నిర్మించనున్నారు. రెండేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది.
