రేపు (జులై 28) కూడా తెలంగాణలో స్కూళ్లకు సెలవు

రేపు (జులై 28)  కూడా తెలంగాణలో స్కూళ్లకు సెలవు

రాష్ట్రంలోని విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు పొడిగించింది. తెలంగాణలో విద్యాసంస్థలకు  జులై 28వ తేదీ శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో.. జులై 28వ తేదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాలకు గ్రామాలు నీట మునుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి ఉధృతి అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు బయటకు రావటం సురక్షితం కాదని భావించిన సీఎం కేసీఆర్.. జులై 28వ తేదీ శుక్రవారం కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

అయితే స్కూళ్లకు సెలవుపై జులై 25వ తేదీ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో జులై 26, జులై 27వ తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయని పేర్కొంది. అయితే వర్షాలు తగ్గకపోవడంతో జులై 28వ తేదీ శుక్రవారం కూడా సెలవు ఉంటుందని తెలిపింది. దీనిపై ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితను సీఎం కేసీఆర్ ఆదేశించారు.