
- 80 మార్కులకు రాత పరీక్ష.. ఇంటర్నల్‌కు 20 మార్కులు
- ఇంటర్నల్ను రద్దు చేస్తూ గతేడాది సర్కారు ఉత్తర్వులు
- తాజాగా ఆ నిర్ణయంపై వెనక్కి
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల విధానంలో మార్పులపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తేయ్యాలని గతంలో నిర్ణయించగా.. తాజాగా వెనక్కి తగ్గింది. ఎప్పట్లాగే పాత విధానంలో 80 శాతం రాత పరీక్షకు, మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ కు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. పదో తరగతిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ఒక్కో పేపర్, సైన్స్ లో మాత్రమే బయోలజీ, ఫిజిక్స్ రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సబ్జెక్టుకు వంద మార్కులు ఉండగా.. దాంట్లో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ కు 20 మార్కులు కేటాయిస్తున్నారు. గతేడాది నవంబర్ లో 2024 – 25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక వంద మార్కుల పేపర్ ఉంటుందని వెల్లడించింది.
కానీ, అప్పటికే దాదాపు సిలబస్ పూర్తికావడం, పలు మోడల్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాట్రన్ మార్చితే స్టూడెంట్లలో అయోమయం నెలకొంటుందనే విమర్శలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం 2025–26 నుంచి వంద మార్కుల పేపర్ తో పరీక్షలు నిర్వహిస్తామని సవరణ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రైవేటు స్కూళ్లు వ్యతిరేకించాయి. ఇంటర్నల్ మార్కులు కంటిన్యూ చేయాలని డిమాండ్‌చేశాయి. కానీ, అప్పట్లో సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మళ్లీ పాత విధానంలోనే పరీక్షలు ఉంటాయని సర్కారు ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. కాగా, ఇప్పటికే ఎస్సీఈఆర్టీ అధికారులు వంద మార్కుల మోడల్ పేపర్‌ను, బ్లూ ప్రింట్‌నూ తయారు చేశారు. త్వరలో బయటకు రిలీజ్ చేద్దామనుకున్న టైంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నది.
అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం
జాతీయస్థాయిలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర సిలబస్ స్కూళ్లతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగుతోంది. ఇది విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గిస్తుందని విద్యావేత్తలు చెప్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తొలగించడంపై ఎన్సీటీఈ కూడా అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో మళ్లీ పాత విధానం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఇక నుంచైనా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలోని స్టూడెంట్లకు ఇష్టానుసారం ఇంటర్నల్ మార్కులు కేటాయించడాన్ని కట్టడి చేయడంపై ఆఫీసర్లు దృష్టిపెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.