
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌పై సర్కారు దృష్టి పెట్టింది. అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విరివిగా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నది. మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకూ ఇంజినీరింగ్ విద్యను అందించేందుకుగానూ అన్ని ఉమ్మడి జిల్లాల్లో సర్కారు కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నది.
ఈ ఒక్క విద్యాసంవత్సరంలోనే ఏకంగా తొమ్మిది విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రారంభించింది. పలు ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు లా కాలేజీలనూ ఏర్పాటు చేసింది. అయితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా అన్నింటిలోనూ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం అక్కడకూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటు
మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ, కరీంనగర్ జిల్లాలోని శాతవాహన వర్సిటీ, నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ వర్సిటీకి అనుబంధంగా 3 ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది.
అయితే, పాలమూరు వర్సిటీ కాలేజీలో 3 బ్రాంచ్‌లు, నిజామాబాద్ ఇంజినీరింగ్ కాలేజీ, హుస్నాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో 4 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లు భర్తీ చేయనున్నారు. మరో పక్క కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొత్తగూడెంలో ఉన్న మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీని ఈ ఏడాది ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది.
ఈ వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు పెట్టారు. ఈ కాలేజీలో డీగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించారు. మరోపక్క మహబూబ్‌నగర్‌లో ఆర్‌జీయూకేటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. దీంట్లో 180 సీట్లను భర్తీ చేశారు.
రెండు పాలిటెక్నిక్, లా కాలేజీలు
రాష్ట్రంలో ఈ ఏడాది మరో రెండు కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను సర్కారు మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో ఆరు కోర్సులతోపాటు పోస్టులను కూడా మంజూరు చేసింది. దీంతోపాటు పాలమూరు, శాతవాహన వర్సిటీలకు కొత్తగా లా కాలేజీలనూ సర్కారు ఏర్పాటు చేసింది.
అయితే, గత విద్యాసంవత్సరం షాద్‌నగర్‌లో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైంది. మరోపక్క నారాయణ పేట జిల్లాలోని కోస్గిలో తొలిసారిగా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఉన్న కాలేజీలన్నీ ఏదో ఒక యూనివర్సిటికీ అనుబంధంగా ఉండగా, సర్కారు ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టేట్‌లోని ఒకే ఒక కాలేజీ ఇదే కావడం విశేషం.
వచ్చే ఏడాది మరిన్ని పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేస్తున్నది.