317 జీవో బాధిత టీచర్లకూ బదిలీలకు ఛాన్స్

317 జీవో బాధిత టీచర్లకూ బదిలీలకు ఛాన్స్

హైదరాబాద్, వెలుగు: 317 జీవో బాధిత టీచర్ల పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు వారి ట్రాన్స్​ఫర్లకు కూడా ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా సర్వీస్​ను పరిగణనలోకి తీసుకొని వారికి అవకాశం ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గతంలో ఇచ్చిన జీవోలో మార్పులు చేస్తూ కొత్త జీవో రిలీజ్ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన బదిలీలు, ప్రమోషన్ల రీషెడ్యూల్ ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్​ ప్రకారం ఈ ప్రాసెస్​ఈ నెల12 నుంచి మార్చి14 వరకు 32 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.

అయితే, ఇప్పటికే సాధారణ ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లకు 59,909 మంది టీచర్లు అప్లై చేసుకున్నారు. తాజాగా 317 జీవో బాధితులు 25 వేల మందికి అవకాశం ఇచ్చారు. వీరిలో 15 వేల మంది వరకు దరఖాస్తు చేసుకొనే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు. వీరు ఈ నెల14,15 తేదీల్లో దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత అధికారులకు అందించాలి. 16,17 తేదీల్లో  డీఈవో, ఆర్జేడీ వెబ్ సైట్లలో సీనియార్టీ లిస్టుల డిస్‌‌ ప్లే చేయనున్నారు. 18–20 వరకు వినతులు స్వీకరించనున్నారు. 21, 22 తేదీల్లో ఫైనల్ సీనియార్టీ లిస్ట్ డీఈవో ఆఫీసు వెబ్ సైట్లలో పెడ్తారు.  బదిలీల కోసం హెడ్మాస్టర్ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ఉంటుంది. ఇలా వివిధ దశల్లో మార్చి 14 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.