వాహనదారులకు మరో షాక్.. గ్రీన్‌‌ ట్యాక్స్‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌ పెంపు

వాహనదారులకు మరో షాక్..  గ్రీన్‌‌ ట్యాక్స్‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌ పెంపు
  • 20 నుంచి 30శాతం దాకా బాదిన ఆర్టీఏ
  • రెండు నుంచి మూడు శ్లాబులకు మార్పు
  • ట్రావెల్స్‌‌పై 5వేల నుంచి 12వేలు అదనం
  • ఇటీవలే లైఫ్‌‌ ట్యాక్స్‌‌ పెంచిన రవాణా శాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: రవాణా శాఖ ఒకదాని తర్వాత ఒకటి ట్యాక్స్‌‌లు పెంచుతు ప్రజలపై భారం మోపుతోంది. ఇటీవలే కొత్త బండ్లపై లైఫ్‌‌ ట్యాక్స్ మోత మోగించగా, ఇప్పుడు గ్రీన్‌‌ ట్యాక్స్‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌ పేరుతో వాహనదారుల నడ్డి విరిచింది. ఈ రెండింటిపై ట్యాక్స్‌‌లు భారీగా పెంచింది. వీటికి సంబంధించిన జీవోలు బయటకు ఇవ్వకున్నా పెంచిన ట్యాక్స్‌‌లను రవాణా శాఖ స్లాట్‌‌ బుకింగ్‌‌ సిస్టంలో అప్‌‌లోడ్‌‌ చేసింది. ఇవి ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రజలపై కొత్తగా వేస్తున్న ట్యాక్స్‌‌‌‌లతో రూ.1600 కోట్ల దాకా అదనపు ఆదాయంతో ఖజానా నింపుకొనేందుకు ప్లాన్‌‌‌‌ చేసింది.

గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ ఇక మూడుసార్లు

రవాణా శాఖ గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ను పెంచాలని నిర్ణయించింది. 15ఏండ్లు దాటిన కమర్షియల్‌‌‌‌ బండ్లకు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌, కండీషన్‌‌‌‌ను మరో ఐదేండ్లు పొడగిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనిలో భాగంగా గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ వసూలు చేస్తారు. రాష్ట్రంలో 15ఏండ్లు నిండిన బండ్లు 30లక్షలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ రెండు శ్లాబులుగా ఉంది. ఏడేండ్లు దాటిన కమర్షియల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు రూ.200, 15 ఏండ్లు నిండిన నాన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు ఏటా రూ.200, 15 ఏండ్లు నిండిన మోటార్‌‌‌‌ సైకిళ్లకు ప్రతి ఐదేండ్లకు రూ.250, మోటార్‌‌‌‌ సైకిళ్లు కాని ఇతర వాహనాలకు ప్రతి ఐదేండ్లకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. తాజాగా రవాణా శాఖ దీన్ని మూడు శ్లాబులుగా మార్పులు చేసింది. ఏడు నుంచి పదేండ్లలోపు బండ్లకు ఒక క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌లో సగం మేర, పది నుంచి పన్నెండేండ్లు అయితే ఒక క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌కు సమానంగా, ఆ పైన సంవత్సరాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌ రెట్టింపు స్థాయిలో ఏటా గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు, మ్యాక్సీ క్యాబ్‌‌‌‌లు, ఓమ్నీ బస్సులు, ప్రయాణికులను రవాణా చేసే కాంట్రాక్టు క్యారేజీలకు 7 నుంచి 10 సంవత్సరాల శ్లాబ్‌‌‌‌కు రూ. 4వేలు, 10 నుంచి 12 ఏండ్ల శ్లాబ్‌‌‌‌కు రూ. ఐదు వేలు, 12ఏండు పైబడిన ఉన్న బండ్లకు రూ.6వేల చొప్పున గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ విధించనున్నారు. మోటార్‌‌‌‌ సైకిళ్ల విషయంలో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసి 15ఏండ్లు పూర్తయితే రూ.2వేలు, 20 ఏండ్లు దాటితే రూ.5వేలు చెల్లించాలి. బైక్‌‌‌‌లు కాకుండా ఇతర వ్యక్తిగత వాహనాలైతే 15ఏండ్ల నుంచి 20 ఏండ్ల శ్లాబ్‌‌‌‌కు రూ. 5వేలు, 20ఏండ్లు దాటిన బండ్లకు రూ. పదివేల చొప్పున వసూలు చేయనున్నారు. ఇక ఎల్‌‌‌‌పీజీ, సీఎన్‌‌‌‌జీ, బ్యాటరీ వెహికల్స్‌‌‌‌ మినహాయింపు ఉంటుంది. దీని వల్ల రవాణా శాఖకు అదనంగా రూ. 120 కోట్ల దాకా సమకూరనుంది.

క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌పై 20శాతం పెంపు 

ట్రాన్స్‌‌‌‌పోర్ట్ బండ్లు అయిన లారీలు, ట్రావెల్స్‌‌‌‌పై 20 శాతం వరకు ట్యాక్స్‌‌‌‌ పెంచారు. ట్రావెల్స్‌‌‌‌ బండ్లపై సీట్లను బట్టి క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌ విధిస్తారు. ప్రస్తుతం సింగిల్‌‌‌‌ డిస్ట్రిక్ట్ పర్మిట్‌‌‌‌ అయితే ఒక్కో సీటుకు రూ. 892 ఉండగా, కొత్తగా రూ. రూ. 1115కి పెంచారు. డబుల్‌‌‌‌ డిస్ట్రిక్‌‌‌‌ అయితే ప్రస్తుతం రూ. 1210 ఉండగా, ఇప్పుడు రూ.1510కి పెంచారు. జనరల్‌‌‌‌గా ట్రావెల్స్‌‌‌‌ బస్సులకు 22 సీట్లు, 28 సీట్లు, 40, 50 సీట్లు ఉంటాయి. ఉదాహరణకు.. 22 సీట్లు తీసుకొంటే ఇప్పటి దాకా మూడు నెలలకు 19,624 ఉండగా, ఇప్పుడు 24,530 అయింది. అంటే సుమారు రూ. 5వేల దాకా పెరిగింది. 

మొన్ననే భారీగా లైఫ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ పెంపు

రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట్నే నాన్‌‌‌‌ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ బండ్లకు లైఫ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ పెంచింది. బండ్లను శ్లాబ్‌‌‌‌లుగా విభజించి.. ఒక్కో బండిపై 2 శాతం నుంచి 4 శాతం వరకు పెంచింది. కొత్త ట్యాక్స్‌‌‌‌ల ప్రకారం బండి రకాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా అదనంగా భారం పెరిగింది. టూవీలర్‌‌‌‌పై అదనంగా రూ.3 వేలు, ఫోర్‌‌‌‌ వీలర్‌‌‌‌పై  రూ.10 వేల నుంచి రూ.80వేల వరకు, టెన్‌‌‌‌ సీటర్‌‌‌‌ నాన్‌‌‌‌ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌పై రూ.1.20లక్షల దాకా అదనంగా పెంచింది. ఇక రెండో బండి కొంటే మరో రెండు శాతం అదనంగా కట్టాల్సి ఉంది.