బడులు మొదలై 4 నెలలు దాటినా.. పైసా ఇయ్యలే

బడులు మొదలై 4 నెలలు దాటినా.. పైసా ఇయ్యలే
  • ఈ ఏడాది స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ ​చేయని సర్కారు
  • కరోనా టైమ్​లో శానిటైజేషన్​కూ నిధులియ్యలే
  • స్కూళ్ల నిర్వహణకు హెడ్మాస్టర్లు, ఎంఈఓల అవస్థలు 
  • అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్న దుస్థితి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. బడులుచాలై నాలుగు నెలలు దాటినా.. సర్కారు ఏ ఒక్క స్కూల్​కూ పైసా కూడా రిలీజ్​చేయలేదు. బడులే కాదు స్కూల్ కాంప్లెక్స్​లు, మండల వనరుల కేంద్రాల నిర్వహణకూ నిధులు లేవు. బడుల్లో స్వచ్ఛ కార్మికులను నియమించలేదు. కరోనా టైమ్​లో కనీసం శానిటైజేషన్​కు కూడా డబ్బులియ్యలేదు. దీంతో అన్ని స్కూళ్ల హెడ్మాస్టర్లు, ఎంఈఓలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సొంత డబ్బులు ఖర్చు చేస్తుండగా, మరికొందరు అప్పులు తెచ్చి ఎల్లదీస్తున్నారు. 

రాష్ట్రంలో విద్యార్థులున్న సర్కారు బడులు 24,814 ఉన్నాయి. బడుల నిర్వహణకు స్టూడెంట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఫండ్స్​ఇస్తోంది. ప్రైమరీ, అప్పర్​ప్రైమరీలను ఒక కేటగిరిగా, హైస్కూల్​మరో కేటగిరిగా విభజించి నిధులు కేటాయిస్తోంది. ఈ లెక్కన ఒక్కో స్కూల్​కు రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు ఫండ్స్​వస్తున్నాయి. అప్పర్ ప్రైమరీ వరకు15 మందిలోపు స్టూడెంట్లుంటే రూ.12,500, వెయ్యి మందికి పైగా ఉంటే రూ. లక్ష చొప్పున స్కూల్ గ్రాంట్స్ ఇస్తారు. ఈ నిధులను ఏటా అకడమిక్​ఇయర్​ప్రారంభంలోనే స్కూల్​ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఈ అకడమిక్​ఇయర్​లో ఇప్పటికి ఒక్కపైసా కూడా ఇయ్యలేదు. నిరుడు కూడా సెప్టెంబర్ లో 25 శాతం, మార్చిలో మిగిలిన 75 శాతం ఫండ్స్​ లేటుగా ఇచ్చింది. 

స్వచ్ఛ కార్మికుల తొలగింపు..

2021–22 అకడమిక్ ఇయర్​ జులై ఫస్ట్ నుంచి మొదలైంది. సెప్టెంబర్​ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. సర్కారు ఇచ్చే స్కూల్​ గ్రాంట్స్​తోనే బడుల్లో పాఠాలు చెప్పేందుకు చాక్​పీస్​లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు, శానిటరీ వర్క్స్, ఎలక్ర్టిసిటీ అండ్ ఇంటర్నెట్ ఛార్జీలు, కంప్యూటర్లు, టీవీలు, ప్రొజెక్టర్ల రిపెర్లు తదితర పనులను చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సర్కారు స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేయలేదు. ఇదీగాక గతంలో పనిచేసిన 28 వేల మంది స్వచ్ఛకార్మికులను,12 వేల మంది విద్యా వలంటీర్లను ఈ ఏడాది తీసుకోలేదు. దీంతో చాలా స్కూళ్లలో హెడ్మాస్టర్లు సొంత నిధులతో కార్మికులను ఏర్పాటు చేసుకున్నారు. 

నెలకు రూ. 10 వేల ఖర్చు..

సర్కారు ఇచ్చే స్కూల్​ గ్రాంట్స్ తోపాటు హెడ్మాస్టర్లు, టీచర్లు దాతల సాయంతో బడులను బాగుచేస్తున్నారు. అయితే కనీసం కరోనా టైమ్​లోనూ శానిటైజేషన్​ కోసం పైసా ఇవ్వక పోవడంపై హెడ్మాస్టర్లు మండిపడుతున్నారు. చాలా నెలల పాటు బడులు మూతపడి తెరుచుకున్న తర్వాత వేలు ఖర్చు చేసి రిపేర్లు చేయించినట్లు పలువురు హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడి నిర్వహణకు కనీసం నెలకు రూ.10 వేలు అవుతుందని నిజామాబాద్​జిల్లాకు చెందిన ఓ హెడ్మాస్టర్ తెలిపారు. పైసలివ్వకుంటే బడులను ఎట్ల నిర్వహించాలని, ఈ విషయం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. 

ఎంఆర్సీలు, కాంప్లెక్స్​లదీ మరీ ఘోరం..

ప్రభుత్వం ఎంఆర్సీ(ఎంఈఓ ఆఫీసు)ల నిర్వహణకు రూ.1.20 లక్షలు, స్కూల్ కాంప్లెక్స్​ల నిర్వహణకు రూ.43 వేలు ఏటా ఇస్తోంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు  కేవలం స్టేట్​లో పాత మండలాల్లోని 467 ఎంఆర్సీ(ఎంఈఓ ఆఫీసు)లకే నిధులిచ్చింది. కొత్త మండలాలకు పైసలివ్వడం లేదు. నిరుడు కూడా ఎంఆర్సీలు, స్కూల్ కాంప్లెక్స్​లకు కేవలం 50 శాతమే నిధులు ఇచ్చారు. ఈ ఏడాది ఇప్పటికీ రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఎంఈఓలది పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా మారిందని ఓ ఎంఈవో ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రాంట్స్ ఇయ్యాలె..

ప్రభుత్వం వెంటనే స్కూల్ గ్రాంట్స్ తో పాటు ఎంఆర్సీ, స్కూల్ కాంప్లెక్స్ నిధులు రిలీజ్ చేయాలి. కరోనా నేపథ్యంలో బడులకు కొంత అదనపు ఫండ్​కేటాయించాలి. కొత్తగా ఏర్పాటైన ఎంఆర్సీలతో పాటు స్కూల్​ కాంప్లెక్స్​లకూ డబ్బులు ఇవ్వాలి. గ్రాంట్స్​రాకపోవడంతో హెచ్​ఎంలు అప్పులు చేసి, సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బడులకు నిధులివ్వాలి. 

–రాజభాను చంద్రప్రకాశ్, జీహెచ్ఎంఏ స్టేట్ ప్రెసిడెంట్