
- ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుది అదే పరిస్థితి
- సీఎం లేఖ తప్ప నిర్దేశిత ఫార్మాట్లో ప్రతిపాదన చేయట్లేదంటున్న ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలనే ప్రపోజల్ఏదీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రానేలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా కింద ఆర్థిక తోడ్పాటు అందించాలంటే ఆ ప్రాజెక్టు తప్పనిసరిగా సీడబ్ల్యూసీ నుంచి అనుమతి పొంది ఉండాలన్నారు. సీడబ్ల్యూసీలోని ఇరిగేషన్అడ్వైజరీ కమిటీ, ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. అలాగే ఆ ప్రాజెక్టు కడుతున్న రాష్ట్రం నిర్దేశిత ఫార్మాట్లో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రతిపాదన పంపాలన్నారు. అన్ని అనుమతులు, రాష్ట్రం నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను హై పవర్ స్టీరింగ్ కమిటీ (హెచ్పీఎస్సీ) పరిశీలించి జాతీయ హోదా పొందేందుకు ఆ ప్రాజెక్టుకు అర్హతలు ఉన్నాయో లేదో నిర్దారిస్తుందన్నారు. హెచ్ పీఎస్సీ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం పరిశీలించి సంబంధిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తుందన్నారు. ఇలా జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 60 శాతం కేంద్రం భరిస్తుందని.. 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని తెలిపారు.
రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం
కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో ఇప్పటికే పలుమార్లు ఇదే సమాధానం చెప్పింది. తెలంగాణ సీఎం లేఖ రాయడం మినహా నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర జలశక్తి శాఖకు, సీడబ్ల్యూసీకి ఎలాంటి ప్రపోజల్ పంపలేదని స్పష్టం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై రాజకీయ విమర్శలు చేస్తూనే ఉంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలనే పొలిటికల్ డిమాండ్ మినహా ప్రతిపాదనలు పంపడంపై కనీసం ఎక్సర్సైజ్కూడా చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు అన్ని అనుమతులు ఉన్నాయి. అడిషనల్ టీఎంసీ పేరుతో ఆ ప్రాజెక్టును అనుమతులు లేని జాబితాలో చేర్చడానికి రాష్ట్ర సర్కారే కారణమైంది. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ)లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సాయం అందించాలనే ప్రపోజల్ సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇంకా అనుమతులు రాలేదు. పర్యావరణ అనుమతులు వస్తే తప్ప మిగతా పర్మిషన్లు వచ్చే అవకాశం లేదని ఇరిగేషన్ వర్గాలే చెప్తున్నాయి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన మొదటి దశ అనుమతులు (టర్మ్స్ఆఫ్రెఫరెన్సెస్) గడువు ముగియడంతో పర్మిషన్ ఇవ్వడం సంక్లిష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పరిస్థితి ఇంతదాక వచ్చింది. అడిషనల్ టీఎంసీని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపోజల్ కేంద్రానికి పంపితే దానికి జాతీయ హోదా వచ్చే అవకాశముందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఇంట్రస్ట్ చూపడం లేదని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు.
రెండు ప్రాజెక్టులకే హెచ్పీఎస్సీ ఓకే
హెచ్పీఎస్సీ ఇటీవల కాలంలో రెండు ప్రాజెక్టులకు మాత్రమే జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెకమండ్ చేసిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. బిహార్‌లో నిర్మిస్తున్న కోసి–మేచి లింక్ ప్రాజెక్టుకు 2015–16 ప్రైస్ లెవల్‌తో రూ.4,900 కోట్లతో ఆమోదం తెలిపిందన్నారు. 2020 నవంబర్‌లో హెచ్ పీఎస్సీ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. అయితే 40 శాతం ప్రాజెక్టు వ్యయం భరించడానికి బిహార్‌ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో దానికి జాతీయ హోదా ఇవ్వలేకపోయామన్నారు. 2022లో కర్నాటక నిర్మిస్తున్న అప్పర్‌భద్రకు జాతీయ హోదా ఇవ్వాలని హెచ్పీఎస్సీ రెకమండ్చేసిందన్నారు. రూ.16,125.48 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు.