ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: అటవీ హక్కుల పరిరక్షణ చట్టం (ఆర్​ఓఎఫ్ఆర్) కింద హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడానికి ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 వేల మంది గిరిజన రైతులకు 27,184 ఎకరాలకు రూ.600 కోట్లతో  స్కీమ్ ను అమలు చేయనుంది. వచ్చే ఐదేండ్లలో 2 లక్షల 10 వేల మంది రైతులకు, 6 లక్షల ఎకరాలకు రూ.12,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ జీవో నంబర్ 15లో స్పష్టం చేశారు. ప్రతి ఏటా 50 వేల మంది రైతులకు 1,43,204  ఎకరాలకు రూ.3 వేల కోట్ల చొప్పున ఈ స్కీమ్ కు ఖర్చు చేయనున్నారు.

 రాష్ట్ర స్థాయిలో 14 మంది అధికారులతో, జిల్లా స్థాయిలో 13 మందితో, మండల్ లెవల్ లో 9 మందితో ఈ స్కీమ్ కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీలు ఉన్నాయి. స్టేట్ లెవల్ కమిటీలో ఫైనాన్స్, పంచాయతీ రాజ్, ట్రైబల్, పవర్, పీసీసీఎఫ్, ఇరిగేషన్, అగ్రికల్చర్ , రెడ్కో ఎండీ, హార్టికల్చర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్, పంచాయతీ రాజ్, రవాణా శాఖ కమిషనర్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఎన్సీ,  ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్, ట్రైకార్ ఎండీలు ఉన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, సిరిసిల్ల, వరంగల్, మెదక్ లను నోడల్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ వీటికి ట్యాగ్డ్ జిల్లాలుగా మరో 13 జిల్లాలను కలిపారు.  3 పేజీలతో రైతుల వివరాలు, భూమి, పట్టా, సాగు చేసే పంటల వివరాలతో అప్లికేషన్ ను రెడీ చేశారు. 

2,30,735 గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్  హక్కు పత్రాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం, 2006 ప్రకారం 2,30,735 గిరిజనులకు అటవీ భూములపై హక్కులను గుర్తించి, 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ భూమిపై యాజమాన్యపు హక్కులు సంక్రమింపజేస్తూ  ఆర్ వో ఎఫ్ ఆర్  హక్కు పత్రాలను జారీ చేసింది. ఇప్పటివరకు 23,886  ఎస్టీ రైతులకు చెందిన 69,039 ఎకరాల భూమికి వివిధ పథకాల కింద రూ.141.57 కోట్ల వ్యయంతో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించింది.

 పథకం అమలును పర్యవేక్షించడానికి జిల్లాల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ( పీఎంయూలు) ఏర్పాటు చేయనున్నారు. ఐటీడీఏ జిల్లాల విషయంలో, పీఎంయూ సంబంధిత పీవో, ఐటీడీఏ నియంత్రణలో ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. అయితే, ఐటీడీఏ యేతర జిల్లాలకు, సంబంధిత జిల్లా కలెక్టర్ నిర్ణయించిన  జిల్లా అధికారి ఉంటారు.