సర్కార్ భూములు అమ్మేసేందుకు కమిటీలు

సర్కార్ భూములు అమ్మేసేందుకు కమిటీలు
  • సీఎస్‌  నేతృత్వంలో స్టీరింగ్‌ కమిటీ
  • న్యాయ శాఖ సెక్రటరీతో ల్యాండ్స్​ కమిటీ
  • జీహెచ్​ఎంసీ అధికారులతో అప్రూవల్​ కమిటీ
  • వేలం వేసేందుకు ఆక్షన్​ కమిటీ
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకానికి రాష్ట్ర సర్కార్​ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్టీరింగ్‌‌  కమిటీ, ల్యాండ్స్‌‌ కమిటీ, అప్రూవల్‌‌ కమిటీ, ఆక్షన్‌‌ కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీరింగ్​ కమిటీకి చీఫ్​ సెక్రటరీ నేతృత్వం వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్‌‌ సమావేశంలో ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మి ఆదాయం రాబట్టుకోవాలని నిర్ణయించారు.కేబినెట్​ తీర్మానంతో భూముల అమ్మకానికి తెర లేచింది. ఆయా కమిటీల విధులు, బాధ్యతలను ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 

ఈ – వేలం ద్వారా భూముల అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్‌‌మెంట్లలో ఉన్న ఆస్తులు కూడా అమ్మేయనున్నారు. ఇందుకోసం స్టాండర్డ్‌‌ ఆపరేటింగ్‌‌ ప్రొసీజర్‌‌ (ఎస్‌‌వోపీ) జారీ చేశారు. ప్రభుత్వ శాఖల ఆధీనంలోని ఖాళీ స్థలాలు, ఉపయోగంలో లేని ఆస్తులు, న్యాయ వివాదాలు లేని భూములను వేలానికి పెట్టనున్నారు. 

వేలం వేసే భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా కలెక్టర్లు చూసుకోవాల్సి ఉంటుందని, ఆ భూములను మల్టీపర్పస్‌‌  యూజ్​ జోన్‌‌గా ప్రకటించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. అమ్మకానికి పెట్టే భూములకు హెచ్‌‌ఎండీఏ, జీహెచ్‌‌ఎంసీ నుంచి అన్ని అనుమతులు సులువుగా మంజూరు చేస్తారు. ఇందుకోసం టీఎస్‌‌ - బీపాస్‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూముల అమ్మకానికి నియమించిన నోడల్‌‌ ఏజెన్సీ వేలానికి సంబంధించిన షెడ్యూల్‌‌ రూపొందిస్తుంది. అమ్మకానికి పెట్టే భూములకు మార్కెట్‌‌లో ఉన్న ధర ఆధారంగా నోడల్‌‌ ఏజెన్సీ రేటు నిర్ణయిస్తుంది. ఆయా భూముల అమ్మకానికి ఈ–ఆక్షన్‌‌ జారీ చేసిన అనంతరం సంబంధిత ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ దాఖలైన బిడ్లను ఫైనల్‌‌ చేస్తారు. వేలంలో భూములు దక్కించుకున్న బిడ్డర్లు పేమెంట్‌‌ చేసిన మూడు వారాల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆ భూమిని అప్పగించాల్సి ఉంటుంది.

ఆక్షన్‌‌ కమిటీ: ప్రభుత్వం అమ్మకానికి పెట్టే భూములు, ప్లాట్లను వేలానికి పెట్టే ఆక్షన్‌‌ కమిటీలో  హెచ్‌‌ఎండీఏ  కమిషనర్‌‌, హౌసింగ్‌‌ బోర్డు ఎండీ, టీఎస్‌‌ఐఐసీ వైస్‌‌  చైర్మన్‌‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సంబంధిత డిపార్ట్‌‌మెంట్ల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఆ స్థలాన్ని కొంత మేరకు అభివృద్ధి చేసి లే ఔట్‌‌ వేయాలి. ఆయా స్థలం, ప్లాట్‌‌, లే ఔట్‌‌ అమ్మకానికి సంబంధించిన బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేయాలి. ఆయా లే ఔట్లలో రోడ్లు వేయడం, స్ట్రీట్‌‌ లైట్లు ఏర్పాటు చేయడం, కొనుగోలుకు ఆసక్తి చూపే వారిని సంబంధిత లే ఔట్‌‌ వద్దకు తీసుకెళ్లి చూపించడం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అప్రూవల్‌‌ కమిటీ: అప్రూవల్  కమిటీలో జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌, హెచ్‌‌ఎండీఏ కమిషనర్‌‌, టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌ సీఎండీ, మెట్రో వాటర్‌‌ బోర్డు ఎండీ, ఫైర్‌‌ సర్వీసెస్‌‌  డీజీ, పొల్యూషన్‌‌  కంట్రోల్‌‌ బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ల్యాండ్స్‌‌ కమిటీ గుర్తించిన భూములను అప్రూవల్‌‌ కమిటీ అభివృద్ధి చేసి, సరిహద్దులు చేసి, లే ఔట్‌‌ చేసి వేలానికి పెట్టాలి. బిల్డింగ్‌‌ పర్మిషన్‌‌, ఎలక్ట్రిసిటీ, ఫైర్‌‌, పొల్యూషన్‌‌  ఇతర అనుమతులు బీపాస్‌‌ ద్వారానే జారీ చేయాలి. సంబంధిత భూమి, ప్లాట్‌‌కు వాటర్‌‌ బోర్డు తాగునీటి, ట్రాన్స్‌‌ కో విద్యుత్‌‌ కనెక్షన్‌‌  ఇవ్వాలి. అమ్మకానికి పెట్టే భూములు, లే ఔట్లను హెచ్‌‌ఎండీఏ, జీహెచ్‌‌ఎంసీ మాస్టర్‌‌ ప్లాన్‌‌లో చేర్చాలి.