వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బైకును ఢీకొట్టి బస్సు పూర్తిగా దగ్ధమైన ఈ ఘటనలో 19 సజీవదహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం ( అక్టోబర్ 24 ) కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గ బైకును ఢీకొట్టి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై సహాయక చర్యలు ముమ్మరం చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
హెల్ప్ లైన్ నెంబర్లు, సంప్రదించాల్సిన అధికారులు వివరాలు:
- 9912919545 ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
- 9440854433 ఈ.చిట్టి బాబు,సెక్షన్ ఆఫీసర్
ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం బలయ్యింది. ఇద్దరు చిన్నపిల్లలు సహా గోళ్ల రమేష్ దంపతులు మృతి చెందారు.గోళ్ల రమేష్ కుటుంబం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లపాలెం అని తెలుస్తోంది. వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడింది రమేష్ కుటుంబం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో రమేష్ సహా భార్య అనూష, చిన్నారులు శశాంక్, మన్హిత మృతి చెందారు. కుటుంబం మొత్తం ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదంగా మారింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. బస్సు పూర్తిగా దగ్ధమైందని.. బస్సులో నుంచి 19 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున 3 నుంచి 3.-10 గంటల సమయంలో బస్సు బైక్ ను ఢీకొనడంతో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు.
