202 హాస్పిటల్స్​కు బ్రాండింగ్ .. మొదటి దశలో 84 సర్కార్ దవాఖానాలు ఎంపిక

202 హాస్పిటల్స్​కు బ్రాండింగ్ .. మొదటి దశలో 84 సర్కార్ దవాఖానాలు ఎంపిక
  • కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌలత్​లు
  • ప్రభుత్వ ఆమోదం తర్వాత టెండర్ల ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వేగంగా అడుగులు వేస్తున్నది. సర్కార్ దవాఖానాలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లుక్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సమస్యలను పరిష్కరిస్తూ.. వాటిని బ్రాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. 202 హాస్పిటల్స్​ను బ్రాండింగ్​కు ఎంపిక చేసింది. సర్కార్ హాస్పిటల్స్​లో రోగులకు మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నిర్ణయించారు.

 మొదటి దశలో 84 హాస్పిటల్స్​ను ఎంపిక చేసి అన్ని రకాల సౌలత్​లు కల్పించనున్నారు. వీటిలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 40, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 44 హాస్పిటల్స్ ఉన్నాయి. రిసెప్షన్ నుంచి ఓపీ కౌంటర్, ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేపింగ్, పార్కింగ్ వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్రాండింగ్ హాస్పిటళ్లకు కొత్త గుర్తింపు ఇవ్వడంతో పాటు రోగులకు నమ్మకం, మంచి వాతావరణం కల్పించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ముందుకెళ్తున్నది.

డిజైన్లు ఆమోదం పొందాక టెండర్లు

సర్కార్ హాస్పిటళ్ల బ్రాండింగ్ ప్రక్రియను విజయంతం చేసేందుకు ప్రభుత్వం 10 మంది ఎక్స్​పర్ట్ ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నియమించింది. వీళ్లు ఆస్పత్రులను సందర్శించి అక్కడి అవసరాలు, స్థానిక పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. దానికి అనుగుణంగా డిజైన్ లను తయారు చేస్తారు. ఈ డిజైన్లు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత టెండర్ ద్వారా పనులు ప్రారంభిస్తారు. ఎంపికైన హాస్పిటల్స్​లో జిల్లా, రీజినల్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. బ్రాండింగ్​తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మొదటి దశ విజయవంతమైతే.. మిగిలిన అన్ని హాస్పిటళ్లను కూడా బ్రాండింగ్ కింద డెవలప్ చేస్తారు.

డిజిటల్ టికెటింగ్ వ్యవస్థ

రోగి హాస్పిటల్​లోకి అడుగుపెట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం బ్రాండింగ్ చేయనున్నది. రిసెప్షన్, ఓపీ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయనున్నారు. స్పష్టమైన సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులు, సౌకర్యవంతమైన కుర్చీలు, డిజిటల్ టికెటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. సిబ్బందికి వారి హోదా ఆధారంగా ప్రత్యేక రంగులతో యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తారు.