సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు : ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముస్లిం మైనార్టీ మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ పై ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రతిఒక్కరూ అప్లికేషన్ పూర్తి చేసి బూత్ లెవల్ ఆఫీసర్లకు ఇవ్వాలని సూచించారు. మైనార్టీ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు పోయాయని, ఆ పరిస్థితిని తెలంగాణలో రానివ్వబోమన్నారు.
బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఓటును తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఒక్క మైనార్టీ ఓటును కూడా తొలగిపోకుండా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.
అంతకు ముందు లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలు ప్రజలకు కనిపిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ పై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్నారు. కాంగ్రెస్ పాలన కమీషన్లతోనే నడుస్తోందన్నారు. గురుకులాల్లో కోడిగుడ్లతో మొదలుకుంటే షూ, యూనిఫామ్ వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే ఇందిరానగర్ హైస్కూల్ కు చెందిన, టెన్త్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన 31 మంది స్టూడెంట్లకు సొంత ఖర్చుతో ఐప్యాడ్లను అందజేశారు. అలాగే చందలాపూర్ గ్రామంలోని ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించి, సిద్దిపేట జిల్లా రైతులకు సరిపడా మొక్కలు అందించిన తర్వాతే మిగతా జిల్లాలకు సరఫరా చేయాలని ఆయిల్ ఫెడ్ అధికారికి సూచించారు.
