
- ఆధారాలు బయటపెట్టినందుకే రఘునందన్పై కేసు : వివేక్ వెంకటస్వామి
- పోలీసులను రాజకీయంగా వాడుకుంటున్నరు
- కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తి చెందారు.. రాబోయేది బీజేపీనే
- హైదరాబాద్లో అంబేద్కర్ విశ్వాస్ కాగడాల ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మైనర్ బాలిక కేసులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు, ఆధారాలు బయటపెట్టినందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మొదట ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేయలేదని, రఘునందన్ ఆధారాలు బయటపెట్టడంతోనే అతనిపై కేసు నమోదు చేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పోలీసులను రాజకీయంగా వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వాస్ కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియం బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి
మాట్లాడారు.
మహిళలకు రక్షణేది?
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వివేక్ అన్నారు. మైనర్ పై రేప్ జరిగి 10 రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ‘‘ప్రతిపక్షాల ఒత్తిడితోనే నామ్కే వాస్తేగా అరెస్టులు చూపారు తప్ప, ఎంక్వైరీలో సీరియస్నెస్ లేదు. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో సాక్ష్యాలను చూపించి, న్యాయం చేయాలని అడిగినందుకు రఘునందన్పై కేసు పెట్టారు. పోలీసు శాఖ ఇప్పటికీ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసుల విచారణ ముందుకుసాగట్లేదు” అని అన్నారు. రోజురోజుకు బీజేపీ బలం పెరుగుతోందని, కేసీఆర్ గ్రాఫ్పడిపోతోందన్నారు. అందుకే కేసీఆర్.. బీజేపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేసినోళ్లను వదిలి, ప్రశ్నించిన వారిని హింసిస్తే ఊరుకోబోమన్నారు.
మోడీ హయాంలో దేశాభివృద్ధి..
కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని, ఆ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని వివేక్ అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. మోడీ హయాంలో దేశం ఆర్థికంగా ఎదిగిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేదలను కేంద్రం ఆదుకుందని.. 10 కిలోల బియ్యం, గ్యాస్ ఉచితంగా అందించిందని గుర్తు చేశారు. కేంద్రం దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు కట్టించిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించిందన్నారు. దళితుల కోసం కేంద్రం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర సర్కార్అమలు చేయడం లేదని.. కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా చెప్పుకుంటోందని ఫైర్ అయ్యారు. ర్యాలీలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా తదితరులు పాల్గొన్నారు.