
- టీవీవీపీ స్థానంలో సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్
- దీని కిందికే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా హాస్పిటళ్లు
- జిల్లాకు ఇకపై ఒకరే బాస్.. ఆరోగ్యశాఖలో కీలక మార్పులు
హైదరాబాద్, వెలుగు : ఆరోగ్యశాఖలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌ను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్(పీహెచ్‌సీ), కొన్ని కమ్యునిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) ఈ విభాగం కింద ఉన్నాయి. ప్రివెంటీవ్ హెల్త్ కేర్ బాధ్యతలను, ప్రైవేటు హాస్పిటళ్ల నియంత్రణ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు తదితర బాధ్యతలన్నీ ఈ విభాగం కిందకే వస్తాయి. డైరెక్టరేట్‌ను రద్దు చేసి ఈ బాధ్యతలను అన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేయనున్న సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ డైరెక్టరేట్ కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.
ఒకే గొడుగు కిందకు
ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖలో నాలుగు కీలకమైన విభాగాలు పనిచేస్తున్నాయి. ఒకటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్), రెండోది వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), నాలుగోది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరేట్(సీఎఫ్‌డబ్ల్యూ). డీపీహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ)లు ఉంటాయి. అంటే ప్రాథమిక ఆరోగ్యం అంతా వీటిల్లోనే జరుగుతుంది. వీటికి బాస్‌లుగా జిల్లాలో డీఎంహెచ్‌వోలు ఉంటారు. ఇక వైద్య విధాన పరిషత్ పరిధిలో కమ్యునిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. మెడికల్ కాలేజీలు డీఎంఈ పరిధిలో ఉంటాయి.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎన్‌హెచ్‌ఎం కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతుంటాయి. ఇప్పుడు టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఫైల్ కదిపింది. పీహెచ్‌సీలను ఈ కొత్త డైరెక్టరేట్ కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో పీహెచ్‌సీలు మొదలుకుని జిల్లా హాస్పిటళ్ల వరకూ ఒకే గొడుకు కిందకు వస్తాయని చెబుతున్నారు.
అన్ని బాధ్యతలు ఒకరికే
జిల్లా స్థాయిలో పీహెచ్‌సీలకు డీఎంహెచ్‌వో హెడ్‌గా వ్యవహరిస్తే, ఏరియా, జిల్లా హాస్పిటళ్లకు డీసీహెచ్‌లు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్ లేదా సూపరింటెండెంట్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా వేర్వేరు వ్యక్తులు హెడ్‌గా ఉండడం వల్ల హాస్పిటళ్ల మధ్య కోఆర్డినేషన్ ఉండడం లేదని సర్కార్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఒకరే బాసును నియమించాలని యోచిస్తోంది. ప్రివెంటీవ్ హెల్త్ కేర్ బాధ్యతలను, ప్రైవేటు హాస్పిటళ్ల నియంత్రణ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు తదితర బాధ్యతలన్నీ వీరికే అప్పగించాలని భావిస్తున్నారు.