వచ్చే సీజన్ నుంచి సీడ్ సబ్సిడీ!.. రాయితీ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్

వచ్చే సీజన్ నుంచి సీడ్ సబ్సిడీ!.. రాయితీ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్
  • వానాకాలం సీజన్​లో సబ్సిడీకి రూ.200 కోట్లు
  • సెంట్రల్ స్కీమ్స్ వినియోగించుకోవాలని నిర్ణయం
  • నాలుగేండ్లు సబ్సిడీ ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వచ్చే సీజన్ నుంచి సీడ్ సబ్సిడీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు తీసుకొచ్చిన తర్వాత విత్తనాలపై సబ్సిడీ ఇవ్వడం ఆపేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాయితీని పునరుద్ధరించాలని అనుకుంటున్నది. గతంలో ఇచ్చిన రాయితీలపై కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఆరా తీసింది. ఏ విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలనే దానిపై అటు వ్యవసాయ శాఖ కూడా కసరత్తు చేస్తున్నది. ఈమేరకు అగ్రికల్చర్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వచ్చే వానాకాలం సీజన్​లో కోటిన్నర ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇన్నాళ్లు 57శాతం రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునేవాళ్లు.

ఇన్నాళ్లు పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితం

పంట పొలాలను సారవంతం చేసేందుకు సేంద్రియ సాగు, భూసారం కాపాడేందుకు రైతులు వేసే పచ్చిరొట్ట (జనుము, జీలుగ, పిల్లిపెసర) విత్తనాలతో పాటు ఇతర సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సబ్సిడీ అందించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. వరి, జొన్న, మక్క, సజ్జ వంటి ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయా వంటి ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు ఇలా పలు విత్తనాలను రాయితీతో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది. 

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇచ్చే సీడ్ సబ్సిడీ కోసమే రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొన్ని విత్తనాలకు 33 నుంచి 67 శాతం దాకా సబ్సిడీ కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో దానికి తగ్గట్టు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జమ చేస్తే.. రైతన్నకు తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలు అందే చాన్స్ ఉంటుంది. కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలపై 33 శాతం దాకా సబ్సిడీ అందే అవకాశం ఉంది. ప్రధానంగా వరి విత్తనాలకు రాష్ట్ర సర్కార్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. వరితో పాటు సోయ, పప్పు ధాన్యాల సీడ్స్​పై రాయితీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి.

2020 నుంచి రాయితీ ఇవ్వని బీఆర్ఎస్

గత బీఆర్ఎస్ సర్కార్ నాలుగేండ్ల పాటు విత్తనాలపై సబ్సిడీ ఎత్తేసింది. 2019 వరకు రాష్ట్రంలో వరి, జొన్న, మక్క, సజ్జ వంటి ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయా వంటి ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల విత్తనాల్లో 33 శాతం సబ్సిడీ వచ్చేది. ఆ తర్వాత 2020 నుంచి విత్తనాలన్నింటిపై సబ్సిడీ ఎత్తేసింది. మేలు రకం విత్తనాలను సబ్సిడీ కింద ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు కంపెనీల వద్ద రెట్టింపు ధరకు విత్తనాలు కొనేవాళ్లు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోవడంతో ప్రతి ఏటా ఏదో ఓ ప్రాంతంలో రైతులు ఆగమయ్యేవారు.