అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్ల రూపంలో అందజేసింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్‌‌‌‌లోని ప్రధాన అంశాలను ప్రభుత్వం బయటపెట్టింది.

ఇప్పుడు 665 పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మంత్రులందరికీ ఈ​ నివేదిక కాపీలను ఇప్పటికే పంపింది. చర్చ సందర్భంగా మంత్రులందరూ ఈ అంశంపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్​ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తేల్చిన సంగతి తెలిసిందే.

ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్​లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్​ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది.

కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్​ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్​ శాఖ మంత్రి హరీశ్​రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్​  కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఆర్థికాంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్​ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్​ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్​ పనితీరునూ తప్పుబట్టింది. కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థలు ఎల్​ అండ్​టీ, ఆఫ్కాన్స్​, నవయుగ సంస్థలూ బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్​ తేల్చి చెప్పింది.