మాస్కులియ్యకుండానే ఫీవర్ సర్వే చేయిస్తున్రు

మాస్కులియ్యకుండానే ఫీవర్ సర్వే చేయిస్తున్రు
  • రోజూ 60 ఇండ్లు తిరుగుతున్న ఒక్కో టీమ్
  • తమకు వైరస్ అంటుతుందేమోనని భయం
  • సర్కారు తమ సేఫ్టీ పట్టించుకోవడంలేదని హెల్త్​ వర్కర్ల ఆవేదన
  • ఎన్95 మాస్కులు ఇవ్వాలని విజ్ఞప్తులు

హైదరాబాద్ / నెట్‌‌వర్క్, వెలుగు: ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్న హెల్త్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మాస్క్‌‌లు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వలేదు. అయినా ఆశా వర్కర్లు, ఏఎన్‌‌ఎంలు చీర కొంగులు, స్కార్ఫులు,  కర్చీఫ్‌‌లు, తమ సొంత డబ్బులతో కొనుకున్న క్లాత్ మాస్కులతోనే సర్వే చేస్తున్నారు. ఒక్కో టీమ్ రోజూ 60 ఇండ్లు తిరిగి, ఆయా ఇండ్లలోని వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో టెస్టులు చేసి, ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టారు. రాష్ట్రంలో ఇంటికో వ్యక్తి దగ్గు, సర్ది, జ్వరంతో బాధపడుతున్న టైమ్‌‌లో.. రోజూ ఇంత మందిని కలిసి పరీక్షలు చేసుడే వారికి పెద్ద భారమవుతోంది. దీనికితోడు కనీసం మాస్కులు కూడా ఇవ్వకుండా పనిచేయమనడం తమ ప్రాణాలతో చెలగాటమాడటమేనని హెల్త్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగే క్రమంలో జనాల నుంచి తమకు కరోనా రావొచ్చని, తమ నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లకు ఇచ్చినట్టుగానే తమకూ ఎన్‌‌‌‌95 మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పది మందిలో ఒకరికి కరోనా లక్షణాలు

రాష్ట్రంలో మూడో రౌండ్ ఫీవర్ సర్వే శుక్రవారం ప్రారంభమైంది. ఆశలు, ఏఎన్‌‌‌‌ఎంలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగారు. ఒక్కో టీమ్‌‌‌‌ 60 ఇండ్లను కవర్ చేసింది. ఏ ఇంటికి పోయినా జ్వరం, సర్దీ, దగ్గు వంటి కరోనా సింప్టమ్స్‌‌‌‌తో బాధపడే వారే ఉన్నారని హెల్త్ వర్కర్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పది మందిలో ఒకరికి కరోనా లక్షణాలు బయటపడుతున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు 45,567 మంది హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన కరోనా ఓపీలో మరో 10,899 మందికి సింప్టమ్స్ ఉన్నట్టు గుర్తించి కిట్లు అందజేశారు. మొత్తం కలిపి శుక్రవారం 56,466 మందికి కిట్లు పంపిణీ చేసినట్టు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు.

  •     మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నవాబ్‌‌‌‌పేట మండలం యన్మన్‌‌‌‌గండ్లలో 70 మందిని సర్వే చేయగా.. ఏడుగురికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. వారికి మెడికల్ కిట్లను ఇచ్చారు.
  •     కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామపంచాయతీలలో  24 టీమ్‌‌‌‌లు 1,494 ఇండ్లల్లో సర్వే చేశాయి. 28 మందికి స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్ కిట్లు అందించారు.
    సెలవులు రద్దు.. రాత్రి దాకా పని
    కరోనా మొదలైనప్పటి నుంచి దవాఖాన్లలో పనిచేసేవాళ్ల కంటే ఊర్లలో పనిచేసే హెల్త్ వర్కర్లకే పనిభారం ఎక్కువైంది. ఇంటింటికీ తిరిగి టెస్టులు చేయడం, మందులు ఇవ్వడం, ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నవాళ్లను పర్యవేక్షించడం, ఐసోలేషన్‌‌‌‌ సెంటర్లలో డ్యూటీలు చేయడం, వ్యాక్సిన్లు ఇవ్వడం వంటి పనుల భారమంతా వారి మీదే ఉంటోంది. నాన్ కమ్యునికబుల్ డిసీజ్ స్ర్కీనింగ్, యాంటినాటల్ చెకప్స్‌‌‌‌ తదితర రెగ్యులర్ వర్క్ కూడా చేస్తున్నారు. పొద్దునంతా పనిచేసి ఆ వివరాలను రాత్రిళ్లు  ట్యాబుల్లో అప్‌‌‌‌లోడ్ చేస్తున్నారు. మరోవైపు ఆఫీసర్లు సెలవులు రద్దు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి దాకా పని చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాగాలేక సెలవు పెడితే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని నవంబర్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆశలు, ఏఎన్‌‌‌‌ఎంలు ధర్నాలు చేశారు. ఇప్పుడు పని మరింత పెంచారు. ఇంతా కష్టపడితే ఆశా వర్కర్లకు వచ్చేది నెలకు రూ.9,750 మాత్రమే. 
  •     హనుమకొండ జిల్లా పరకాల మండలంలో నాలుగు సబ్ సెంటర్ల పరిధిలో 10 టీమ్​లు సర్వే చేశాయి. 1,647 మందితో మాట్లాడగా.. వారిలో 107 మందికి, నడికుడ మండలంలో 35 మందితో మాట్లాడగా.. ఆరుగురికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు.
  •     వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానీపేటలో 100 మందిని సర్వే చేయగా, 11 మందికి లక్షణాలున్నట్టు గుర్తించి కిట్లు పంచారు.
  •     భూపాలపల్లి జిల్లాలో దాదాపు 300 టీమ్​లు 15,481 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించాయి. 849 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించి, ఐసొలేషన్ కిట్లను అందించారు.
  •     ములుగు జిల్లాలో 12,208 ఇళ్లలో 38,727 మందిని సర్వే చేశారు. ఇందులో 1,019 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అందరికీ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు.
  •     మహబూబాబాద్ జిల్లాలో 38,237 మందిని సర్వే చేయగా 1,285 మందిలో లక్షణాలు గుర్తించారు.
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44,968 ఇండ్లలో సర్వే చేశారు. 2,854 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి, హెల్త్ కిట్లు అందజేశారు.
  •     నాగర్ కర్నూలు జిల్లాలో 35,005 ఇండ్లలో ఫీవర్ సర్వే చేయగా 769 మందికి కొవిడ్ లక్షణాలున్నట్టు గుర్తించారు. వారికి కిట్స్ ఇచ్చారు.
  •     మెదక్ జిల్లాలో 633 టీంలు 37,711 ఇళ్లకు వెళ్లాయి. ఇందులో 2,443 మందికి కరోనా సింప్టమ్స్ గుర్తించి, కిట్లు ఇచ్చారు.
  •     సిద్దిపేట జిల్లాలో 837 టీమ్​లు 32,178 ఇండ్లను విజిట్ చేసి, 632 మందికి లక్షణాలున్నట్లు గుర్తించాయి.
  •     సంగారెడ్డి జిల్లాలో 510 టీంలు 59,150 ఇండ్లను సర్వే చేసి, 982 మందికి కిట్లు పంపిణీ చేశాయి.
  •     పెద్దపల్లి జిల్లాలో 25,381 ఇండ్లల్లో సర్వే చేయగా, 948 మంది జ్వరం, దగ్గు, సర్దీ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. వారందరికీ మెడికల్ కిట్లను అందించారు.
  •     ఆదిలాబాద్ జిల్లాలో 29,976 ఇండ్లకు గాను 706 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లాలో 58,440 ఇండ్లు సర్వే చేసి 2,041 మందికి, యాదాద్రి జిల్లాలో 2,3536ఇండ్లలో సర్వే చేసి 1,254 మందికి, నిజామాబాద్ జిల్లాలో 1,06,093 ఇండ్లను విజిట్ చేసి  1,835 మందికి, ఆసిఫాబాద్​ జిల్లాలో 23,712 ఇండ్లలో సర్వే చేసి 657 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
  •     కామారెడ్డి జిల్లాలో 856 టీమ్స్ 50,985 ఇండ్లను విజిట్ చేయగా.. 1,146 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు.
  •     నిర్మల్ జిల్లాలో 485 టీంలు 41,295 ఇండ్లను సర్వే చేశాయి. ఇందులో 807 మందికి ఫివర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

సర్వే చేయాలన్నరు.. ఏం ఇయ్యలే

ఫీవర్ సర్వే చేయాలని మా సార్ వాళ్లు చెప్పిన్రు. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇయ్యలె. మా దగ్గరున్న క్లాత్ మాస్కులు తెచ్చుకొని వాడుతున్నం. కొందరికి అవి కూడా లేక స్కార్ఫులు, కర్చీఫ్‌‌‌‌లు కట్టుకుంటున్నరు. డాక్టర్లకు ఇచ్చినట్టుగా మాకూ ఎన్‌‌‌‌95 మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులియ్యాలె.

- బాలీశ్వరమ్మ, ఏఎన్ఎం, నవాబ్‌‌‌‌పేట, మహబూబ్‌‌‌‌నగర్