- దేశంలోని పార్టీ స్టేట్ ఆఫీసుల్లో నిర్వహించాలి: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’మొదటి దశను శనివారంతో ముగించాలని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీ స్టేట్ ఆఫీసుల్లో ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత సంతకాల సేకరణకు సంబంధించి సమగ్ర వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు.
రెండో దశలో భాగంగా సంతకాల సేకరణ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత వాటిని రాష్ట్రపతికి అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. 5 కోట్ల మంది సంతకాలు చేసి తమ మద్దతు తెలిపారన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్, బీజేపీ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడ్డారంటూ రాహుల్ గాంధీ పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రస్థాయిలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహించిన ర్యాలీలు విజయవంతం అయ్యాయని చెప్పారు. ఈ ప్రచారంలో జిల్లాలు, బ్లాక్‌లు, మండలాల్లోని లక్షలాది మంది పౌరులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
