బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్.. ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో 65% ఓటింగ్.. 11న సెకండ్ ఫేజ్

బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్.. ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో 65% ఓటింగ్.. 11న సెకండ్ ఫేజ్
  • ఓటేసిన సీఎం నితీశ్, లాలూ, తేజస్వీ యాదవ్ 
  • డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌‌పై దాడి 
  • 11న సెకండ్ ఫేజ్ పోలింగ్.. 14న రిజల్ట్


పాట్నా: బిహార్‌‌‌‌లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొదటి దశలో 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డ్ స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

మొత్తం 18 జిల్లాల్లో ఎలక్షన్ జరగ్గా.. అత్యధికంగా 

ముజఫర్ పూర్ లో అత్యధికంగా 70.96 శాతం ఓటింగ్ జరిగింది. అలాగే సమస్తిపూర్ లో 70.63 మాధేపురాలో 67.21, వైశాలిలో 67.37, సహర్సాలో 66.84, ఖగాడియాలో 66.36, లఖీసరాయ్ లో 65.05 శాతం పోలింగ్ రికార్డ్ అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. అప్పటికే క్యూలో నిల్చున్నవాళ్లు ఓటేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తన నియోజకవర్గం లఖిసరాయ్‌‌లో ఓటర్లను ఆర్జేడీ లీడర్లు అడ్డుకున్నారని, తన కాన్వాయ్‌‌పై దాడి చేశారని డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. 

మరోవైపు తమ కూటమి బలంగా ఉన్నచోట ఉద్దేశపూర్వకంగా ఓటింగ్‌‌ నెమ్మదించేలా చేశారని ఆర్జేడీ ఆరోపించింది. ఇక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్‌‌ బరిలో పలువురు ప్రముఖులు నిలిచారు. ఇండియా కూటమి సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పలువురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, బిహార్‌‌‌‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తొలి దశలో 121 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న రెండో విడతలో 122 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న ఫలితాలు వెల్లడిస్తారు. 

ఓటేసిన ప్రముఖులు..

బిహార్‌‌‌‌ ఫస్ట్ ఫేజ్‌‌ ఎలక్షన్‌‌లో పలువురు ప్రముఖులు ఓటేశారు. సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్, ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌‌‌‌లో అందరూ ఓటు వేయాలంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అధిక మెజార్టీతో ఎన్డీయే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఓటు వేయండి.. ఇతరులతో ఓటు వేయించండి” అంటూ సీఎం నితీశ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక అధికారంలోకి వచ్చేది తామేనని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.  

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌‌కాస్టింగ్.. 

ఈసీ తొలిసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌‌కాస్టింగ్ నిర్వహించింది. ప్రతిపోలింగ్ బూత్‌‌లో సీసీ కెమెరాలు అమర్చి, కంట్రోల్ రూమ్‌‌కు అనుసంధానించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు ఎస్ఎస్ సంధూ, వివేక్ జోషి కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్‌‌ను పర్యవేక్షించారు.

డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ కాన్వాయ్‌‌పై దాడి!

ఆర్జేడీ కార్యకర్తలు తన కాన్వాయ్‌‌పై దాడి చేశారని డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ‘‘నా నియోజకవర్గం లఖిసరాయ్‌‌లో ఓటర్లను ఆర్జేడీ కార్యకర్తలు ఉదయం నుంచి బెదిరిస్తున్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల వారిని ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. 

నా కాన్వాయ్‌‌లోని ఒక కారుపై రాళ్లు, చెప్పులు, ఆవు పేడతో ఆర్జేడీ కార్యకర్తలు దాడి చేశారు. వాళ్లను అడ్డుకునేందుకు వెళ్లిన మా కార్యకర్తను కొట్టారు. ఇప్పుడతను ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నాడు” అని తెలిపారు. దీనిపై ఈసీ స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. కాగా, ‘‘సిన్హా అబద్ధాలకోరు. ఆయనకు జడ్ ప్లస్  సెక్యూరిటీ ఉంది. వాళ్ల పార్టీనే అధికారంలో ఉంది. ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు” అని ఆర్జేడీ పేర్కొంది.