ఏప్రిల్ లేదా మేలో టెట్!.. ప్రపోజల్స్ రెడీ చేస్తున్న సర్కారు

ఏప్రిల్ లేదా మేలో టెట్!..  ప్రపోజల్స్ రెడీ చేస్తున్న సర్కారు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డీఎస్సీ అంశం తెరమీదికి వచ్చింది. ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌‌కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే.. ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది.

ఎగ్జామ్స్, ఎన్నికలు అయ్యాక..

ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా.. మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పరీక్షకు నిరుద్యోగులతోపాటు టీచర్లూ హాజరుకానుండటంతో వారందరిని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు.

టీచర్లు టెట్ రాయాల్సిందేనా?

2011 నుంచి జరుగుతున్న రిక్రూట్‌మెంట్లతోపాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు ఐదేండ్లు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆతర్వాత మరో ఐదేండ్లు దాన్ని పొడిగించింది. ఈ గడువు 2019తో ముగిసింది. ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కారు రెడీ కాగా.. టెట్ క్వాలిఫై ఉన్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకు పోయారు. వారికి అనుకూలంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2012 , 2017లో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు చేరిన వారు 15 వేల మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరితో పాటు మరో పదివేల మంది వరకూ టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు. వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే. దీంతో ఈ సారి టెట్ టీచర్లూ అటెండ్ కానున్నారు.