స్కూల్​ బుక్స్​లో తప్పులపై తెలంగాణ సర్కారు సీరియస్

స్కూల్​ బుక్స్​లో తప్పులపై తెలంగాణ సర్కారు సీరియస్
  •    ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, టెక్ట్స్ బుక్స్ డైరెక్టర్ శ్రీనివాస​చారికి షోకాజ్
  •     మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
  •     తెలుగు పుస్తకాలన్నీ వెనక్కి తీసుకున్న టీచర్లు
  •     రెండుమూడు రోజుల్లో సరిచేసి పున:పంపిణీ

హైదరాబాద్, వెలుగు:  స్కూల్​ బుక్స్​లో తప్పులపై సర్కార్ సీరియస్ అయింది. తెలుగు పుస్తకాల్లో సీఎం, విద్యాశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారుల పేర్లను తప్పుగా ప్రింట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఇద్దరు విద్యాశాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరోపక్క తప్పుడు పేర్లతో ఉన్న తెలుగు పుస్తకాలను స్కూళ్ల నుంచి వెనక్కి తీసుకున్నది. రెండు, మూడు రోజుల్లో మళ్లీ వాటిని సరిచేసి, విద్యార్థులకు అందించనున్నారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాసు వరకు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ముందుమాటలో సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అని, 2015లో పనిచేసిన విద్యాశాఖ అధికారుల పేర్లను ప్రింట్ చేశారు. 

అభ్యస దీపికల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లతో ముద్రించారు. బుధవారం పుస్తకాల పంపిణీలో ఈ తప్పు బయటపడటంతో, సర్కారు తీవ్రంగా స్పందించింది. డిసెంబర్ మొదటివారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మార్చి మూడోవారంలో పుస్తకాలను ప్రింట్ చేసేందుకు ఎస్​సీఈఆర్టీ అధికారులు.. టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ అధికారులకు సీడీలు అందించారు. టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ అధికారులు సీడీలోని కంటెంట్​ను యథాతధంగా ప్రింట్ చేశారు. టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ అధికారులకు కంటెంట్​లో ఏ చిన్న మార్పు కూడా చేసేందుకు పర్మిషన్​ ఉండదు. 

అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత ప్రింటింగ్​కు పంపించిన కంటెంట్​లో కూడా పేర్లను సవరించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియాలోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై సర్కారు సీరియస్​గా రియాక్ట్ అయింది. పుస్తకాల్లో తప్పులకు బాధ్యులను చేస్తూ ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డితో పాటు టెక్ట్స్ బుక్ డైరెక్టర్ శ్రీనివాసచారికి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘వీ6, వెలుగు’లో వచ్చిన ‘ఇంకా కేసీఆరే సీఎం అట’ హెడ్డింగ్​తో ప్రచురితమైన అంశాన్నీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 

పుస్తకాలు వెనక్కి..

మాజీ సీఎం, మాజీ మంత్రుల పేర్లతో వచ్చిన తెలుగు పుస్తకాలను, అభ్యస దీపికలను వెనక్కి తీసుకోవాలని శ్రీదేవసేన డీఈఓలకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పంపిణీ చేసిన వాటిని రిటర్న్ తీసుకున్న వాటితో పాటు పంపిణీ చేయని వాటిన్నింటినీ కలిపి ఎంఈఓ ఆఫీసులకు పంపించాలని సూచించారు. వాటిని రెండు, మూడు రోజుల్లో మాడిఫై చేసి, స్టూడెంట్లకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రార్థనా గీతం ముందు.. ఆ తర్వాత మాడిఫై చేసిన ముందుమాట తర్వాత వచ్చేలా మార్పులు చేస్తున్నారు.