
- స్పందించని సీఎం, మంత్రులు.. ఆందోళనలో లక్షల మంది నిరుద్యోగులు
- రిక్రూట్మెంట్ మీటింగ్‌లోనూ చర్చించని సీఎస్
- ఊగిసలాటలో టీఎస్పీఎస్సీ
- అన్ని పరీక్షల పేపర్లూ లీకయ్యాయని నిరుద్యోగుల్లో అనుమానాలు
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
- టీఎస్పీఎస్సీ ఆఫీసు ఏరియాలో 144 సెక్షన్
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. రాష్ట్ర సర్కారులో మాత్రం ఉలుకూ లేదు పలుకూ లేదు. పరీక్షల నిర్వహణపై లక్షల మంది ఆందోళనలో ఉంటే.. కనీసం స్పందిస్తలేదు. కమిషన్ కూడా నాన్చుడు ధోరణిలో ఉన్నది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నపత్రం లీకైందని పోలీసులు అధికారికంగా
ప్రకటించినా.. పరీక్షను రద్దు చేయాల్నా వద్దా అనేదానిపై మూడు నాలుగు రోజులు ఊగిసలాడింది. చివరికి అభ్యర్థుల నిరసనలకు దిగొచ్చి.. ఏఈ ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. మరోపక్క ఏఈతోపాటు గ్రూప్1 ప్రిలిమ్స్, ఇతర ఎగ్జామ్స్‌ను కూడా క్యాన్సిల్ చేయాలని, పేపర్లన్నీ లీకయ్యాయని విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. నిరుద్యోగుల పోరాటానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై 9 మందితో విచారణ కమిటీని బీజేపీ వేసింది. ఇంత జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ గానీ, మంత్రులు గానీ, చివరికి సీఎస్ శాంతికుమారి గానీ స్పందించడంలేదు.
సైలెంట్ ఎందుకు?
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో 30 లక్షలకు పైగా మంది వన్ టైమ్ రిజిస్ర్టేషన్(ఓటీఆర్) చేసుకున్నారు. నిరుడు 17వేలకు పైగా పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈ సహా మొత్తం 6 రిక్రూట్మెంట్ టెస్టులు జరిగాయి. గత ఏడు రోజులుగా టౌన్ ప్లానింగ్ రిక్రూట్మెంట్ పేపర్‌తో పాటు, అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ల లీక్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. పోలీసులు తమ విచారణలో ఆ రెండు పేపర్లూ లీక్ అయినట్టు, దీనికి టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్, నెట్ వర్క్ అడ్మిన్ రాజశేఖర్ ద్వారానే తతంగం జరిగిందని తేల్చారు. దీంతో ప్రవీణ్‌ను కమిషన్ అధికారులు సస్పెండ్ చేయగా, రాజశేఖర్‌ను విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం లీకేజీతో సంబంధం ఉన్న 9 మంది జైల్లో ఉన్నారు. టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్లతోపాటు గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ కూడా లీకైందని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరగడంతోనే ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ నోరు విప్పడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మంగళవారం టీఎస్పీఎస్సీ మినహా మిగిలిన అన్ని రిక్రూట్మెంట్ బోర్డుల ప్రతినిధులతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సమావేశయ్యారు. కమిషన్ మీటింగ్ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అధికారులు సీఎస్ వద్ద సమావేశానికి హాజరుకాలేదా.. లేక వారిని మీటింగ్‌కు పిలువలేదా? అనేదానిపై స్పష్టత లేదు. సమావేశంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఒక్క మాట కూడా సీఎస్ మాట్లాడలేదు.
కమిషన్ ఊగిసలాట
పేపర్ లీకేజీలపై శుక్రవారం పోలీసుల నుంచి ఫిర్యాదు అందితే.. మంగళవారం వరకూ టీఎస్పీఎస్సీ స్పందించలేదు. విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతుండటంతో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే, పోలీసుల నుంచి అధికారికంగా రిపోర్టు వచ్చిన తర్వాతే, పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోపక్క ప్రవీణ్ కుమార్ సెల్ ఫోన్ పై ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక, అన్నింటిపైనా క్లారిటీ వస్తుందని కమిషన్ అధికారులు చెప్తున్నారు.
ఏఈ ఎగ్జామ్ రద్దు
ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 837 పోస్టుల ఈ పరీక్షను 55 వేల మంది రాశారు. పేపర్ లీక్ కావడంతో.. రద్దు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.