అభయ హస్తం డబ్బులు వాపస్.! గ్రామాల వారీగా లిస్ట్ రెడీ

అభయ హస్తం  డబ్బులు వాపస్.! గ్రామాల వారీగా లిస్ట్ రెడీ
  • లబ్ధిదారులకు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం
  • గ్రామాల వారీగా లిస్ట్ రెడీ చేస్తున్న అధికారులు
  • రూ.545 కోట్లలో రూ.152 కోట్లు చెల్లించిన గత సర్కార్
  • వడ్డీతో కలిపి రూ.425 కోట్లు అవుతాయని అంచనా
  • రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మందికిపైగా లబ్ధిదారులు 

హైదరాబాద్, వెలుగు: కొన్నేండ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ పథకం కింద 2009 నుంచి 2016 వరకు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు జమ చేసిన నిధులను తిరిగి వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా  గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అండగా నిలిచేందుకు 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. సంఘంలో చేరిన ప్రతి మహిళా సభ్యురాలు సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే  ప్రభుత్వం కూడా అంతే మొత్తం డబ్బులు జమ చేసింది.  సంఘ సభ్యులు 60 ఏండ్ల వయసు దాటితే రూ.500 పింఛన్ అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది.

 అలాగే..  కుటుంబంలో 9, 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్న వారి పిల్లలకు ఏడాదికి రూ.1,200 చెల్లించింది. సభ్యురాలు సహజ మరణం పొందితే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500  చెల్లించేవారు. అయితే, 2016 వరకు ఈ పథకం సజావుగానే  కొనసాగినా..  బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో  నిలిపివేసింది. ఆసరా పింఛన్ ప్రారంభించి.. పింఛన్ సొమ్ము రెట్టింపు చేసింది.  గతంలో అభయహస్తంలో భాగంగా కట్టిన  సొమ్ము తిరిగి చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటనలు చేసినా.. కార్యరూపం దాల్చలేదు. 60 ఏండ్లు దాటిన మహిళలు ఇటు అభయ హస్తం, అటు ఆసరా డబ్బులు చెల్లించినా సొమ్ము రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసాన దశలో ఆసరా అవుతుందని భావించిన వృద్ధులకు నిరాశే ఎదురవుతోంది. తాజాగా ప్రభుత్వం వీరి సొమ్ము చెల్లించేందుకు ముందుకు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభయ హస్తం, ఆసరా పింఛన్ సొమ్ము దారి మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. 

425 కోట్లు చెల్లించేందుకు సన్నాహాలు.. 

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా అభయహస్తం నిధులు సుమారు రూ.425  కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. 2009 నుంచి 2016 వరకు 21 లక్షల మంది మహిళలు జమ చేసిన సొమ్ము ప్రభుత్వం వద్దే ఉండగా.. 2022 మార్చి నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.545 కోట్లయింది. 2022లో గత ప్రభుత్వం రూ.152 కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అది కూడా కేవలం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని మహిళలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసినట్టు తెలిసింది. మరో రూ.393 కోట్లు ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి. తాజాగా వడ్డీతో కలిపి  సుమారు రూ.425 కోట్ల వరకు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేలా సర్కారు నిర్ణయం తీసుకున్నది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను తయారు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేయడంతో వారు సెర్ప్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అభయ హస్తంలో ప్రీమియం సొమ్ము చెల్లించిన లబ్ధిదారులు ఎంత మంది? ఇందులో ఎవరైనా చనిపోయారా?  ప్రస్తుత ఉన్నవారి వివరాలు, మృతిచెందిన సభ్యురాళ్ల వారసుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం సేకరిస్తున్నారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత  ప్రభుత్వం తిరిగి సొమ్ము వారి అకౌంట్లలో జమ చేయనున్నది. అంతేకాకుండా, గతంలో మాదిరిగా సభ్యురాళ్ల కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్ షిప్ కూడా అందజేయనున్నది.