ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు .. యూనిక్ ఐడీతో ఇవ్వనున్న సర్కార్

ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు .. యూనిక్ ఐడీతో ఇవ్వనున్న సర్కార్
  • రేషన్ కార్డుతో లింకు కట్
  • అందరికీ స్కీమ్ వర్తింపజేసేందుకు కసరత్తు
  • రూ.400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా
  • స్కీమ్‌‌లోకి ట్రామాకేర్, మరిన్ని  ప్రొసీజర్లు

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వనున్నది. ప్రైవేట్​ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో  ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌‌గా తీసుకొని యూనిక్ ఐడీతో కార్డులు తేనున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సబ్ నంబర్ ఇవ్వనున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌‌ను మెయింటెయిన్ చేయనున్నారు. 

లోక్‌‌సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. తెల్ల రేషన్‌‌ కార్డును ఇన్నాళ్లు ప్రాతిపదికగా తీసుకొని ఈ స్కీమ్‌‌ను అమలు చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్‌‌కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో స్కీమ్‌‌లో లబ్ధిదారులను గుర్తించడం ఎలా? అన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్‌‌కార్డు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్‌‌ను వర్తింపజేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి రూ.1,100 కోట్లు ఖర్చవుతున్నాయి. 

స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అందరికీ వర్తింపజేస్తే ఇంకో రూ.400 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో సుమారు 1.3  కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మిగిలిన 40 కుటుంబాల్లో  సుమారు 15 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోను ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాలు మాత్రమే మిగులుతాయి. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, సింగరేణి వంటి కార్పొరేషన్ల ఉద్యోగులకు ఆ సంస్థలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ స్కీములు ఉన్నాయి. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఉద్యోగాలు, మంచి ప్రైవేట్​ ఉద్యోగాలు చేసేవాళ్లు ప్రభుత్వంపై ఆధారపడకుండా, సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్​ తీసుకుంటున్నారు. పేద కుటుంబాలకు చెందినవారే ఆరోగ్యశ్రీ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీని అందరికీ వర్తింపజేయడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడదని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ప్రొసీజర్లు

ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం అందిస్తున్న చికిత్సలకు అదనంగా మరికొన్ని ప్రొసీజర్స్‌‌‌‌‌‌‌‌ను కలపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇప్పటివరకూ సుమారు 72 కొత్త  ప్రొసీజర్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1,670  ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రొసీజర్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. వీటికి సుమారు మరో వంద కలిసే అవకాశం ఉన్నది. అలాగే ప్యాకేజీల ధరల సవరణపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆరోగ్యశ్రీ ప్రారంభమైనప్పటి ప్యాకేజ్​ ధరలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రొసీజర్లకు మాత్రమే పదిశాతం మేరకు గతంలో ధరలు పెంచారు. 

దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజ్ రేట్స్ పెంచాలని నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటళ్లు కోరుతున్నాయి. గత ప్రభుత్వం హాస్పిటల్ యాజమాన్యాల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ లిమిట్‌‌‌‌‌‌‌‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. కానీ, ప్యాకేజీల ధరలను సవరించకపోవడంతో  ఇప్పటికే పాత తరహా పరిస్థితే కొనసాగుతున్నది. ఆరోగ్యశ్రీ పేషెంట్ దవాఖానకు పోతే హాస్పిటళ్ల యాజమాన్యాలు అదనంగా డబ్బులు కడితేనే చికిత్స చేస్తాం అని తెగేసి చెబుతున్నాయి. దీంతో రోగులు తమ జేబులనుంచి అదనంగా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తున్నది.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ట్రామాకేర్!

యాక్సిడెంట్లు, స్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌, సూసైడ్స్ తదితర ఎమర్జెన్సీ కండీషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పేషెంట్లకు ప్రైవేట్​ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామాకేర్ ప్యాకేజ్‌‌‌‌‌‌‌‌ను తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామాకేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ అయ్యే పేషెంట్‌‌‌‌‌‌‌‌కు రూ.లక్ష వరకూ చార్జిలను ప్రభుత్వమే భరిస్తున్నది. గోల్డెన్ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందించి పేషెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాణాలను కాపాడటమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. 

మన స్టేట్‌‌‌‌‌‌‌‌లో కూడా ఇదే తరహా పద్ధతిని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ట్రామాకేర్ ప్యాకేజీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే చాన్స్ ఉందంటున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ఎంపానల్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉండి, స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ను ట్రామాకేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉపయోగించుకోవచ్చునని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన డబ్బులను ప్రభుత్వమే ఆ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చెల్లిస్తుంది. పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత కుటుంబ సభ్యుల కోరిక ప్రకారం అక్కడే చికిత్స కొనసాగించొచ్చు లేదా మరేదైనా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కూ తరలించుకునే వెసులుబాటు ఉంటుంది.