
- ఎల్పీజీ, సీఎన్జీ, ఈవీ ఆటోలకు పర్మిషన్లు ఇవ్వనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల కొత్తగా ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు ఇవ్వనున్న పర్మిట్లపై ప్రభుత్వం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఓఆర్ఆర్ లోపల నివసించే నిరుపేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కొత్త ఆటోలకు ఇటీవల అనుమతిచ్చిన సర్కార్.. ఇప్పుడు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. కొత్తగా ఆటో కొనుగోలు చేయాలనుకునేవాళ్లు రాష్ట్రంలో ఏ డీలర్ వద్దనైనా కొనుగోలు చేయొచ్చన్నారు. పర్మిట్ తీసుకునే వ్యక్తి ఓఆర్ఆర్ లోపల నివాసం ఉంటున్నట్టు ప్రూఫ్ జత చేయాలి. ఒక మనిషికి ఒక ఆటోకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఇంతకుముందు అతని పేరుతో ఆటో ఉంటే అనర్హులు. తన పేరు మీద ఇప్పటి వరకు ఆటో లేదని అఫిడవిట్ డీలర్‌కు సమర్పించాలి.
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ పద్ధతిలో అప్రూవల్ ఇస్తారు. అనుమతిచ్చిన 60 రోజుల్లోగా ఆటోను రవాణా శాఖ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే పర్మిట్ రద్దవుతుంది. డీలర్ వద్ద నమోదైన వివరాలు ఆన్‌లైన్‌లో ఏ ఆర్టీఏ ఆఫీసుకు వస్తాయో.. అక్కడి అధికారులు పరిశీలించి 24 గంటల్లోగా అప్రూవల్ గానీ, రిజెక్ట్ గానీ చేస్తారు. ‘‘నిబంధనల మేరకే డీలర్లు ఆటోలు అమ్మాలి. ఎక్కువ ధరకు అమ్మడం, ప్రాసెసింగ్ కోసం డబ్బులు వసూలు చేయడం, బ్లాక్ మార్కెట్ చేయడం, బ్లాక్ చేయడం, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయడం లాంటి ఫిర్యాదుల వస్తే చర్యలు తీసుకుంటాం” అని ప్రభుత్వం హెచ్చరించింది.