- 342 బస్సుల కొనుగోలుకు రూ.123.12 కోట్ల సేకరణ
- జూన్ 2న ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు
- ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చెల్లిస్తున్న ఆర్టీసీ
- రాష్ట్ర వ్యాప్తంగా 553 మండల సమాఖ్యలకు 600 బస్సులు కొనాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ను ప్రవేశపెట్టింది. మహిళల స్వయం ఉపాధికి బాటలు వేయడంతోపాటు వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు సెర్ప్ ద్వారా లోన్లు అందజేస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 553 మండల సమాఖ్యలకు 600 బస్సులు కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తొలి విడతలో 152 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చింది.
దీని ద్వారా ఒక్కొక్క మండల సమాఖ్యకు ప్రతినెలా రూ.69,468 ఆదాయం సమకూరుతున్నది. తాజాగా మండలానికో బస్సు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో మండలానికో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. కాగా, మహిళా క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, గోదాముల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్న ప్రభుత్వం.. మహిళా సంఘాల చేత బస్సులను సైతం కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రూ.123.12 కోట్లు మండల సమాఖ్యల నుంచి సేకరణ..
రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా జూన్ 2న కొత్త బస్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో సంఘాలకు రుణ లభ్యత సులభతరం కావడమే కాకుండా నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. మహిళా సంఘాల ద్వారా నడిచే ఈ అద్దె బస్సులకు ఆర్టీసీ ప్రతినెలా రూ.69,468 చెల్లించనుంది.
ఈ ఆదాయం ద్వారా మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను తీర్చుకుంటూనే.. మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరు లభించనుంది. అంతేకాదు, ఆర్టీసీకి బస్సుల కొరత తీరడంతోపాటు మహిళా సంఘాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
కాగా, రాష్ట్రంలోని 565 మండలాల్లో మహిళా సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో 152 బస్సులు నడుస్తుండగా.. తాజాగా మరో 342 బస్సుల కొనుగోలుకు అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఇందుకు అవసరమైన రూ.123.12 కోట్ల నిధులను మండల సమాఖ్యల నుంచి సేకరించి సెర్ప్ ద్వారా అందజేశారు. ఈ నెలలో మరో 106 బస్సుల కొనుగోలుకు అవసరమైన రుణాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొలి విడుతలో 152 మండల సమాఖ్యలకు బస్సులు..
రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. తొలి విడతలో 17 జిల్లాల్లో 152 మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఇప్పటికే బస్సులు కొనుగోలు చేసి వివిధ డిపోలకు అందజేసింది. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు అవసరం కాగా, సెర్ప్ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు, మండల సమాఖ్యల నుంచి రూ.6 లక్షలు ఖర్చు చేశారు. మొత్తం 152 బస్సుల కొనుగోలుకు రూ.54.36 కోట్లను సెర్ప్, మండల సమాఖ్యలే సమకూర్చాయి.
రెండు, మూడు విడతల్లో మరో 449 బస్సులు కొనుగోలు చేసేలా ప్లాన్ రెడీ చేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్లతోపాటు డీజిల్, నిర్వహణ ఖర్చులను సైతం సంస్థే భరిస్తుండడంతో మహిళా సమాఖ్యలకు ఆర్థిక భారం తగ్గుతోంది. ఏడేళ్లపాటు అద్దె చెల్లించిన తర్వాత బస్సులు ఆర్టీసీ సొంతం కానున్నాయి.
మహాలక్ష్మి స్కీమ్‌కు తీరిన బస్సుల కొరత..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ క్రమంలో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల కొరత ఏర్పడింది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం ఆర్టీసీకి భారంగా మారింది. ఈ క్రమంలో మహిళా సంఘాల అద్దె బస్సుల వినియోగంతో బస్సుల కొరత తీరినట్లైంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బస్సులను అద్దెకు తీసుకునే బదులు మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను తీసుకుంటుండటంతో ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సంఘాలకు మేలు జరుగుతోంది.
