రుణ విమోచన కమిషన్ దిక్కులేదు!

రుణ విమోచన కమిషన్ దిక్కులేదు!
  • ఈ ఏడాది మార్చిలో ముగిసిన పదవీకాలం
  • కమిషన్​ లేక బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల మధ్య నలిగిపోతున్న రైతులు
  • అప్పుల భారంతో దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్​, వెలుగు :  ఇతర రాష్ట్రాల్లో రైతు కుటుంబాల కష్టాలకు చెక్కులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణలో రైతులను మాత్రం ఆదుకునేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఒకవైపు ప్రైవేట్​ వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు, మరోవైపు డిఫాల్టర్ల లిస్టుల్లో చేరుస్తున్న బ్యాంకుల వల్ల రాష్ట్ర రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. తమ కష్టాల గురించి చెప్పుకునేందుకు వారికి ఉన్న ఒకే ఒక్క వేదిక రుణ విమోచణ కమిషన్. అయితే దానికి​పాలకవర్గం లేకపోవడంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో తెల్వక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు మనోవేదన అనుభవిస్తున్నారు. 

నిరాశతో వెనుదిరుగుతున్న రైతులు

వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుని అవస్థలు పడుతున్న నిజామాబాద్​ జిల్లాకు చెందిన దాదాపు 30 మంది రైతులు తమ బాధలు చెప్పుకునేందుకు ఇటీవల రుణ విమోచణ కమిషన్​ ఆఫీస్​కు వచ్చి అక్కడ ఎవరూ లేక నిరాశతో వెనుతిరిగారు. ఇలా ప్రతి రోజూ 5 నుంచి 10 మంది రైతులు రుణ విముక్తి కోసం వస్తున్న రైతులు తమ బాధలు తీరకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఏడాది మార్చి 12తో రుణ విమోచన కమిషన్​ పాలకవర్గం గడువు ముగిసింది. ఆ తర్వాత ఎవరిని నియమించకపోవడంతో ఆఫీస్​కు తాళం పడింది.

అప్పుడు.. ఇప్పుడు అట్లనే..

రుణ విమోచన కమిషన్​ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 2018 కంటే ముందే హైకోర్టు కమిషన్​ ఏర్పాటు విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లో ఏర్పాటు చేయాలని చెప్పినా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిషన్​ను నియమించింది. ఈ కమిషన్​ ఇతర రాష్ట్రాల్లో రైతుల అప్పులపై అధ్యయనాలు చేసి ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. అదే టైంలో సమస్యలతో వచ్చిన రైతులకు పరిష్కార మార్గాలు చూపి వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు కూడా అధిక వడ్డీలు వేసి.. అప్పులు చెల్లించాలని వేధించడంతో కమిషన్​ను ఆశ్రయించి పలువురు రైతులు న్యాయం పొందారు. ఇప్పుడు రాష్ట్ర సర్కార్​ రుణమాఫీ చేయకపోవడం, ఇటీవల కాలంలో రైతులపై వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరుగుతున్న సందర్భంలో రుణ విమోచణ కమిషన్​ లేకపోవడం రైతన్నలకు ఇబ్బందిగా మారింది. 

అప్పుకు భూమికి లింక్​ పెట్టి అగ్రిమెంట్లు

బ్యాంకులు డిఫాల్టర్లుగా గుర్తించడం, కొత్తగా అప్పు ఇవ్వకుండా సతాయిస్తుండటంతో చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. తాకట్టు కింద రైతుల భూములను పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అగ్రిమెంట్​ రాయించుకుంటున్నారు. అనుకున్న టైంలో వడ్డీతో పాటు అప్పు చెల్లిస్తే.. భూమి పత్రాలు ఇవ్వడం.. లేదంటే భూమిని వారి పేర రాయించుకోవడం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో రియల్​ బూమ్​ పెరిగింది. దీంతో ఐదెకరాలు ఉన్న రైతు రూ.5 లక్షల పెట్టుబడి కోసం అప్పు చేయాల్సి వస్తే.. ఏకంగా రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా విలువ చేసే భూములను తాకట్టు పెడుతున్నారు. తిరిగి అప్పు చెల్లించేప్పుడు కాస్త ఆలస్యమైనా వడ్డీ వ్యాపారులు ఎకరం భూమిని తమ పేరు మీద రాయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి అనేక విషయాలు రుణ విమోచన కమిషన్​ ఎంక్వైరీల్లో గతంలో గుర్తించారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా తోటపల్లికి చెందిన ఓ వ్యాపారి విషయంలో రైతు సంతోష్​ కుమార్​ ఇలానే ఇబ్బందులకు గురయ్యారు. వ్యాపారి దగ్గర పెట్టుబడి అవసరాలకు రైతు రూ.5 లక్షలను.. 3 రూపాయాల వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. ఏడాదిలోగా తిరిగి కట్టాలని అగ్రిమెంట్​ రాసుకున్నారు. తాకట్టు కింద 2.32 ఎకరాల భూమిని ఆ వ్యాపారి రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయించుకున్నాడు. అప్పు.. వడ్డీతో కలిపి రూ.13.38 లక్షలకు చేరిందని, అవసరమైతే మరో రూ.4 లక్షలు తీసుకుని భూమిని పూర్తిగా వదిలేయాలని రైతుపై ఒత్తిడి చేశాడు. దీంతో సంతోష్​ రుణ విమోచన కమిషన్​ను ఆశ్రయించి న్యాయం పొందాడు.

కమిషన్​ను నియమించాలి
అప్పుల విషయంలో రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రుణ విమోచన కమిషన్​ చైర్మన్, కమిషన్​ సభ్యులను నియమించాలి. ప్రభుత్వ బ్యాంకుల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం, ప్రైవేట్​ వడ్డీ వ్యాపారుల విషయంలో జోక్యం చేసుకుని వేధింపుల నివారణకు కృషి చేయాలి. ఇతర రాష్ట్రాల్లో రైతుల కష్టాలపై మాట్లాడటమే కాదు.. తెలంగాణలోని పరిస్థితులనూ చక్కదిద్దాలి.
- దొంతి నర్సింహారెడ్డి, ఎక్స్​ఫర్ట్