కట్టుడు కంప్లీటైనా.. ఇండ్లు ఇస్తలేరు..

కట్టుడు కంప్లీటైనా.. ఇండ్లు ఇస్తలేరు..

‘డబుల్’ ఇండ్ల లబ్ధి దారుల ఎంపికలో తీవ్ర నిర్లక్ష్యం
కామారెడ్డి జిల్లాలో 2,600 ఇండ్ల నిర్మాణం పూర్తి
పంపిణీ చేసినవి 550 మాత్రమే

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ చేయడంతోపాటు కంప్లీట్ అయిన ఇండ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయడంలోనూ సర్కార్ నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇండ్లు నిర్మించి నెలలు గడుస్తుండగా పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. పంపిణీ చేసే విషయంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కామారెడ్డి జిల్లాకు డబుల్ బెడ్ రూం ఇండ్లు 8,176 మంజూరయ్యాయి. ఇందులో 5,582 ఇండ్ల టెండర్లు పూర్తి చేసి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ స్కీమ్ షురువైనప్పటి నుంచి ఇప్పటివరకు 2,600 ఇండ్లు పూర్తయ్యాయి. వీటిలో 550 మాత్రమే పంపిణీ చేశారు. మిగతా 2,050 ఇండ్లు పూర్తయినప్పటికీ పంపిణీ చేయలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కేవలం బాన్స్వాడ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో చాలాచోట్ల వర్క్స్ కంప్లీట్ అయినప్పటికీ పంపిణీ కాలేదు. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో నిర్మాణాలే పూర్తి చేయలేదు.

చిక్కులొస్తాయని..
కామారెడ్డి టౌన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు కంప్లీట్ అయి ఏడాది కావస్తున్నా పంపిణీ చేయలేదు. మున్సిపల్ ఎలక్షన్ కు ముందు పంపిణీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఆపేశారు. ఇండ్లు వందల్లో ఉండగా, లబ్ధిదారులు వేలల్లోఉన్నారు. అర్హులను గుర్తించి కేటాయించిన తర్వాత ఇండ్లు రాని వారిలో వ్యతిరేకత ఏర్పడుతుందని అప్పట్లో పంపిణీ చేయలేదు. ఇప్పట్లో ఎలాంటి ఎలక్షన్లు లేవు. అన్ని ఎలక్షన్లు కంప్లీట్ అయ్యాయి. అయినా లబ్ధిదారులను ఎంపిక చేయడంలేదు. మిగతా నిర్మాణాలు కంప్లీట్ అయ్యాక పంపిణీ చేయవచ్చనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డి , జుక్కల్ నియోజకవర్గాల్లో పనుల్లో వేగం పెంచాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ చూపితేనే పనుల్లోవేగం పెరగటంతోపాటు లబ్ధిదారులకు పంపిణీ కూడా జరగనుంది.

కామారెడ్డి నియోజకవర్గానికి 1,715 ఇండ్లు శాంక్షన్ కాగా, ఇందులో 970 కంప్లీట్ అయ్యాయి. 745 ఇండ్ల నిర్మాణ పనులు పలు దశల్లోఉన్నాయి. 970 ఇండ్లలో 700 ఇండ్లు పూర్తయి ఏడాదికి పైగా కావస్తోంది. కానీ లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. కామారెడ్డి టౌన్ లోని రాజీవ్ నగర్, రామేశ్వర్ పల్లి శివారు, టెక్రియాల్, నర్సన్నపల్లి, లింగాయపల్లి, ఇల్చిపూర్, రామారెడ్డి మండలం అన్నారంలో వర్క్స్ కంప్లీట్ అయి నెలలు గడుస్తోంది. లబ్ధిదారులను గుర్తించి కేటాయించకపోవడంతో ఇడ్లు వృథాగా ఉన్నాయి. పలు చోట్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కొన్ని నెలల కింద అప్లికేషన్లు స్వీకరించగా పది వేల వరకు వచ్చాయి.

బాన్సువాడ నియోజకవర్గానికి 3,310 డబుల్ బెడ్ రూం ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఇందులో 1,587 ఇండ్ల వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. 550 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా వాటిని కూడా పంపిణీ చేయాల్సి ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1,735 శాంక్షన్ కాగా, ఇందులో 43 ఇండ్లు కంప్లీట్ అయ్యాయి. మిగతా వాటి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కంప్లీట్ అయిన ఇండ్లను కూడా ఎవరికీ పంపిణీ చేయలేదు. జుక్కల్ నియోజకవర్గానికి 1,416 ఇండ్లు శాంక్షన్ కాగా పనులు వివిద దశల్లో ఉన్నాయి.

For More News..

తెలంగాణలో మరో 2,924 కరోనా కేసులు నమోదు

నాకు ఆ పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది

బాక్సర్‌గా బరిలోకి దిగుతున్న తెలుగమ్మాయి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పర్మినెంట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం?