
- అవినీతిపరులందరిపైనా కఠిన చర్యలు తప్పవు
- ఊరు, పేరు, డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు
- కేసీఆర్ దోపిడీ దొంగగా మారి రాష్ట్రాన్ని ఆగం చేశారు
- నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్నదే ఆయన దురాశ
- ప్రాణహిత–-చేవెళ్లకు అనుమతులున్నా దోపిడీ కోసమే లొకేషన్ మార్పు
- మహారాష్ట్ర అభ్యంతరాలు ఎత్తుపైనే.. ప్రాజెక్టు నిర్మాణంపై కాదు
- సీడబ్ల్యూసీ అభ్యంతరం చెప్పినా.. మేడిగడ్డ దగ్గర ఎట్లా నిర్మించారని ప్రశ్న
- పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై సభలో రాత్రి 1.30 గంటల వరకు సుదీర్ఘ చర్చ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై ఆదివారం అసెంబ్లీలో 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎన్నో విచారణార్హమైన అంశాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున సీబీఐ ఎంక్వైరీకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. గత ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్, కాగ్ రిపోర్ట్లు కూడా గత ప్రభుత్వ పెద్దలను తప్పు పట్టాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే చెప్పింది” అని సీఎం తెలిపారు.
అవినీతిపరులను వదలం
అవినీతిపరులందరిపైనా కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీరు బంగారం కంటే విలువైనదని, తెలంగాణ రాష్ట్రం నీటి సమస్యల వల్లే ఏర్పడిందని, రూ.లక్ష కోట్లు దోచుకున్న వారిని ప్రభుత్వం వదలబోదని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ బయటపెట్టిన అక్రమాలు, అవినీతిపై అందరి సలహాలు తీసుకుని చర్యలకు ఉపక్రమించాలనే రిపోర్ట్‌ను చర్చకు పెట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిందని, ఆ కమిషన్ కేసీఆర్‌కు 8బీ, 8సీ నోటీసు ఇస్తే కోర్టుకు వెళ్లారని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు ఆ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని పేర్కొంటూ కాళేశ్వరం నివేదికను కొట్టేయాలని కోర్టుకు వెళ్లారని అన్నారు. ప్రజల సొమ్మును, సెంటిమెంట్‌ను ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలియాలనే ఈ చర్చ పెట్టామని పేర్కొన్నారు. తాను సభకు నాయకుడినని, సరైన టైమ్‌లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో తనకు తెలుసని తెలిపారు. వాస్తవానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను కోర్టు తిరస్కరించిందని, సుప్రీం రిటైర్డ్ జడ్జిని నియమించాలని సూచించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్‌కు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎన్‌డీఎస్‌ఏ, కాగ్ నివేదికలను అందించామని చెప్పారు. వాటిని కమిషన్ ఎలా ఉపయోగించుకుందో తమకు తెలియదని వెల్లడించారు.
వాస్తవాలు బయటపెట్టినందుకే ఘోష్‌పై అక్కసు
వాస్తవాలు బయటపెట్టినందుకే పీసీ ఘోష్‌పై బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి. లోక్‌పాల్‌గా కూడా పనిచేశారు. ఆయన రాసిన 665 పేజీల రిపోర్టులో పేజీ నెంబర్ 98లో హరీశ్‌రావును పిన్‌పాయింట్ చేసి.. తప్పులకు ఆయనే కారణమని స్పష్టంగా రాశారు” అని పేర్కొన్నారు. అందుకే ఆయనపై బీఆర్ఎస్ నేతలు ద్వేషం పెంచుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు మార్పు కోసం నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు కలిసి నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ నివేదికను కూడా తొక్కిపెట్టారని చెప్పారు. ఆ కమిటీ తమ నివేదికలో ‘‘మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం అధిక వ్యయంతోపాటు సమయం వృథా కారణంగా అనుకూలమైనది కాదు’’ అని స్పష్టంగా రాసిందని తెలిపారు. ఈ నివేదికలు దోచుకోవాలనే తమ ప్రణాళికలకు విరుద్ధంగా ఉండటంతో, దానిని తొక్కిపెట్టి, సిస్టమ్ నుంచి మాయం చేశారని ఆరోపించారు. ఇవన్నీ కాదని హరీశ్‌రావు సభలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దానిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. భవిష్యత్ తరాలు ఈ తప్పుడు సమాచారం చూసి భ్రమలకు లోనయ్యే అవకాశం ఉందని, అందుకే వాస్తవాలు చెప్పాలని సూచించారు.
దోపిడీ చేసేందుకే నీటి లభ్యతపై మళ్లీ ఎగ్జామిన్
ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టుకు 2009, 2014లోనే అనుమతులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2015 మార్చి 13న నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖను చదివి వినిపించారు. ఆ లేఖలో “ప్రాణహిత–-చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చాం. దీని ప్రకారం మీరు ముందుకు వెళ్లండి” అని స్పష్టంగా ఉందని తెలిపారు. ఆ లేఖపై అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా సంతకం చేసి, కేంద్రం రాసిన లేఖను మళ్లీ పరిశీలించాలని అధికారులను కోరారన్నారు.2014 అక్టోబరు 24 నాటి సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ ప్రకారం.. 205.8 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని స్పష్టంగా తెలిసినా.. ప్రాజెక్టును మార్చాలన్న దురాశతో మళ్లీ ‘ఎగ్జామిన్ చేయండి’ అని కేంద్రాన్ని కోరారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా, 2009 జులై 18 -నాటి సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ ప్రకారం.. 236.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని రికార్డులు చూపిస్తున్నాయని వెల్లడించారు. ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టు కింద జారీ అయిన ఈ లేఖ, రాష్ట్రానికి నిర్మాణం కొనసాగించమని సూచించిందని, ఈ రికార్డులను విస్మరించి, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును మార్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇన్ని స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టిందని, ప్రాజెక్టును మార్చడం ద్వారా ప్రజల సొమ్మును దోచుకోవాలనే దురాశతో తప్పుడు నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ముంపు ప్రాంతం తగ్గుతుందనే తుమ్మిడిహెట్టి దగ్గర ఎత్తు తగ్గించుకోవాలని మహారాష్ట్ర కోరింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ప్రాజెక్టు లొకేషన్ ఎందుకు మార్చారో చెప్పండి. కేసీఆర్‌కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలని దురాశ కలిగిందేమో. తెలంగాణ ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ప్రాజెక్టును మార్చారు. అన్ని అంశాలపై నాటి చీఫ్ ఇంజినీర్ హరిరామ్ స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని కమిషన్ నివేదిక చెప్పింది. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ తెచ్చుకున్నాం. ఏనుగులను తినేవాళ్లు పోయారు.. పీనుగులను తినేవాళ్లు వచ్చారు. నిజాలు తెలుస్తాయనే నివేదికపై చర్చను అడ్డుకుంటున్నారు. మీరు చేసిన తప్పులు ఎంత దాచాలన్నా దాగవు. అర్ధరాత్రి 2 గంటల వరకైనా చర్చకు సిద్ధం” అని వ్యాఖ్యానించారు.
ఎత్తుపైనే మహారాష్ట్ర అభ్యంతరం..
మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు నీటి లభ్యతపై కాదని, బ్యారేజీ ఎత్తుపై మాత్రమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీశ్‌రావు, దివంగత విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చించారు. ఆనాడు 1975 నాటి ఒప్పందం నుంచి మొదలుపెడితే, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన ప్రాణహిత –చేవెళ్ల వరకు 148 మీటర్ల ఎత్తున కట్టుకోవాలా? 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టుకోవాలా? అనేది దానిపైనే చర్చ జరిగింది. మహారాష్ట్ర వాళ్లు 148 మీటర్లు కట్టుకోండి, మా భూమి ముంపు తక్కువ ఉంటదని అన్నారు. ఉమ్మడి ఏపీగానీ, తెలంగాణ గానీ 152 మీటర్ల ఎత్తుకు కట్టుకుంటే మేం 160 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాయి.165 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాయి. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని అభ్యంతరం పెట్టలేదు. వాళ్లకున్న అభ్యంతరమల్లా 152 మీటర్ల ఎత్తున కడితే మా భూమి ఎక్కువ ముంపుకు గురైతదని. కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్లు అడిగిన్రు. మరి ఈ లోపల 80వేల పుస్తకాలు చదివిన మేధావి (కేసీఆర్)కు మెదడులో ఏం పురుగు తొలిచిందో.. కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెల్వదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆ గర్భశ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ, దురాశ ఏమి కలిగిందో తెల్వదు. ప్రాజెక్టును మార్చేసిండు” అని వ్యాఖ్యానించారు.
రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ నివేదికనూ తొక్కిపెట్టిన్రు..
తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి అనంత రాములు రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ తెలిపారు. ఈ కమిటీకి గత ప్రభుత్వం ఏం వివరాలు ఇవ్వలేదని అన్నారు. ఆ కమిటీ గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని, దీంతో ఆ నివేదికను తొక్కిపెట్టారని తెలిపారు.‘‘నాటి చీఫ్ ఇంజినీర్హరిరామ్ చాలా స్పష్టంగా రాశారు. వీళ్ల ఉద్దేశం అంతా ప్రాజెక్టు నిర్మాణాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించి, అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కట్టాలి.. లిఫ్టులు, పంపులు పెట్టాలి. తద్వారా లక్ష కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ వీళ్ల ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజినీర్స్ కమిటీ తూట్లు పొడిచింది.. అది తప్పు అని చెప్పింది. ఈ నివేదికను ఎక్కడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్లి మాయం చేశారు. మళ్లీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు బయటపెట్టిన” అని పేర్కొన్నారు.
సీడబ్ల్యూసీ చెప్పినా వినకుండా కట్టిన్రు..
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్.. తుమ్మిడిహెట్టి వద్ద ఇచ్చిన ముందు జాగ్రత్తలే చేసిందని, అయినా పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సిగరెట్ ప్యాకెట్లపై ‘స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్టు హెల్త్’ అని రాసినట్లే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు సీడబ్ల్యూసీ హెచ్చరిక చేసినా.. ప్రాజెక్టు ఎలా నిర్మించారని ప్రశ్నించారు. పీసీ ఘోష్ నివేదిక కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించిందని స్పష్టం చేశారు. ఈ తప్పుకు వీళ్లని ఉరితీయాలి కదా? అని అన్నారు. సమయానుకూలంగా చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు తొడుక్కుంటున్నారని ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టు లొకేషన్ మార్పు కేసీఆర్ నిర్ణయమే
తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చడానికి నాటి సీఎం కేసీఆరే కారణమని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సాంకేతిక నిపుణులు ఒక విధంగా సూచనలు చేస్తే.. అప్పటి ప్రభుత్వం మరో విధంగా వ్యవహరించిందని తెలిపారు. ప్రాజెక్టు సాంకేతికతను మార్చడంలో అప్పటి మంత్రి హరీశ్‌రావు పాత్ర ఉన్నదని అన్నారు. వ్యాప్కోస్ సంస్థ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని సూచించిందని తెలిపారు. అయితే, అప్పటి సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని కోరారని, దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాలని వ్యాప్కోస్‌కు సూచించారని వివరించారు. ఈ విధంగా అప్పటి పాలకులు అడిగిన దాని ప్రకారం నిపుణుల నివేదికలు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘దొర.. దోపిడీ దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారు. అయితే, ఆనాడు శిక్షలు వేసినట్లుగా మేం వారిని రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి తీయలేదు’’ అని పేర్కొన్నారు. తాము చట్ట ప్రకారం.. పద్ధతిగా వ్యవహరిస్తున్నామని, అందుకే ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. కేసీఆర్ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో 11శాతం మిత్తికి అప్పులు తెచ్చారని , తాను దాన్ని 7.25 శాతానికి రీస్ట్రక్చర్ చేయించానని తెలిపారు. తాను ప్రతిసారీ ఢిల్లీకి సర్కస్ చూసేందుకు వెళ్లలేదని, ఇప్పటివరకూ 26,540 కోట్ల అప్పును రీస్ట్రక్చర్‌కు అనుమతి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
దొర.. దోపిడీ దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నరు. అయితే, ఆనాడు శిక్షలు వేసినట్లుగా మేం వారిని రాళ్లతో కొట్టలేదు. నడి రోడ్డులో ఉరి తీయలేదు.చట్ట ప్రకారం పద్ధతిగా వ్యవహరిస్తున్నం. అందుకే ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తున్నం. - సీఎం రేవంత్ రెడ్డి