మల్టీ పర్పస్ వర్కర్లను తొలగించొద్దు... జిల్లా పంచాయతీ అధికారులకు కమిషనర్ ఆదేశాలు

మల్టీ పర్పస్ వర్కర్లను తొలగించొద్దు... జిల్లా పంచాయతీ అధికారులకు కమిషనర్ ఆదేశాలు
  •     నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
  •     జీవో 51 ప్రకారమే కొత్త నియామకాలు జరగాలి

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల (ఎంపీడబ్ల్యూ)ను అకారణంగా తొలగించడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాత వర్కర్లను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో), కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ శనివారం మెమో విడుదల చేసింది. 

మల్టీ పర్పస్ వర్కర్ల నియామకం, కొనసాగింపు విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 51 అమలు చేయాలని  స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు గ్రామాల్లో పాత వర్కర్లను తొలగిస్తున్నట్లు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ కార్మిక సంఘం, ఎంప్లాయీస్ యూనియన్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఏ ఒక్క వర్కర్‌ను తొలగించడానికి వీల్లేదని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. 

డిజిటల్ రికార్డుల్లో మార్పులు కుదరవు..

కార్మికుల వివరాలన్నీ ఇప్పటికే ఈ-–పంచాయతీ వెబ్‌సైట్‌తోపాటు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదై ఉన్నాయని, ఆ సంఖ్యలో మార్పులు చేయడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. కార్మికుల వేతనాలకు సంబంధించి అక్విటెన్స్ రికార్డులను పక్కాగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను తొలగించినా, కొత్త వారిని నియమించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.