
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణతోపాటు మహిళా యూనివర్సిటీ ఏర్పాటుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెండు అంశాలపై చట్టం తెస్తారని అంతా భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అయితే ఫీజుల నియంత్రణ, మహిళా యూనివర్సిటీ ఏర్పాటును 2022–23 విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని ఇప్పటికే సర్కారు ప్రకటించింది. ఈ మధ్యే అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడటంతో మళ్లీ సమావేశాలు జరగాలంటే కొంత టైమ్ పట్టే అవకాశముంది. దీంతో అనివార్యంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ వచ్చిన 6 నెలల వరకూ చట్టం చేసుకునే వెసులుబాటు ఉండటంతో దీనివైపే ప్రభుత్వం మొగ్గుచూపనున్నట్టు చెప్తున్నారు.
అమలుకు నోచుకోని సర్కారు జీవోలు
రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం సర్కారు పలు జీవోలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేటు మేనేజ్మెంట్లు కోర్టుకు వెళ్లి వాటిని అడ్డుకుంటున్నాయి. దీంతో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో నిర్ణయించారు. విధివిధానాల రూపకల్పనకు కేటీఆర్, హరీశ్ రావు, సబితాఇంద్రారెడ్డి సహా 11 మంది మంత్రులతో సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సబ్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. మేనేజ్మెంట్లు ఏటా పది శాతం ఫీజులు పెంచుకునేలా, హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా కమిటీ వేయాలనే పలు ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు.
గతంలో ప్రైవేటు వర్సిటీలపై ఆర్డినెన్స్ తెచ్చిన సర్కారు
హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీనీ యూనివర్సిటీగా మార్చాలని రాష్ట్ర కేబినెట్ గతంలోనే నిర్ణయించింది. అయితే వర్సిటీ ఏర్పాటుకు చట్టం తప్పనిసరి. దీంతో ఫీజుల నియంత్రణతోపాటు మహిళా వర్సిటీ ఏర్పాటుపై చట్టం చేస్తారని అంతా భావించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మహిళా వర్సిటీని ప్రారంభిస్తామని సర్కారు చెప్పింది. దీనికితోడు బడ్జెట్లో రూ.వంద కోట్లు కేటాయించింది. గతంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు సందర్భంలోనూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.