ఎస్సీల అభివృద్ధికి  సర్కారు యాక్షన్ ప్లాన్

ఎస్సీల అభివృద్ధికి  సర్కారు యాక్షన్ ప్లాన్
  • జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని నిర్ణయం
  • జిల్లాల నుంచి ప్రతిపాదనలు తీసుకోనున్న ప్రభుత్వం
  • ఇప్పటికే బడ్జెట్ లో రూ.1,500 కోట్లు కేటాయింపు
  • వచ్చే బడ్జెట్​లో మరిన్ని నిధులు కేటాయించే చాన్స్
  • ఎస్సీ ఉప కులాలకూ ప్రత్యేక కార్పొరేషన్లు

హైదరాబాద్, వెలుగు:  ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.1,500 కోట్ల నిధులు కేటాయించిన సర్కారు.. జూన్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఎస్సీల డెవలప్​మెంట్​కోసం జిల్లాల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆ తరువాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు, సంఘాల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకొని అమలు చేయనుంది. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఒక్కటే ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాల, మాదిగలకు సపరేట్ గా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు ఎస్సీ ఉప కులాలకు సైతం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

జనాభా ప్రాతిపదికన నిధుల ఖర్చు

రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో ఉన్న మాలలు, మాదిగలతో పాటు అన్ని ఉప కులాల జనాభాపై గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉన్నాయి. వీటి ఆధారంగా నిధులు ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. గత పదేండ్లుగా ఎస్సీ జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు, ఖర్చు జరగడం లేదని ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.  వీటికి చెక్ పెడుతూ పకడ్బందీగా నిధులు ఖర్చు చేయాలని సర్కారు నిర్ణయించింది.

ప్రతిపాదనల కోసం ఆల్ పార్టీ మీటింగ్ 

ఎస్సీల అభివృద్ధి యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లాల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎస్సీ సంఘాలు, యూనియన్లతో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి వారి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోనుంది. గత పదేండ్లలో నిధులు ఉన్నా ఖర్చు పెట్టకపోవడం, ఖర్చు పెట్టిన వాటికి ఇన్ టైమ్ లో బిల్స్ రిలీజ్ చేయకపోవడం, అర్హులకు స్కీమ్ లు దక్కలేదన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిని కరెక్ట్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దళిత బంధు, మూడెకరాల భూ పంపిణీ, స్కాలర్ షిప్స్, వ్యాపారాల ఏర్పాటు, కారు కొనుగోలుకు కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇవన్ని యాక్షన్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర నిధులనూ ఉపయోగించే చాన్స్ 

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి స్కీమ్​కు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అన్ని శాఖల్లోని స్కీమ్స్​కు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్​కు మ్యాచింగ్ గ్రాంట్స్​ను సైతం సకాలంలో రిలీజ్ చేసి, వాటిని ఆయా శాఖల్లో అమలవుతున్న స్కీమ్​లకు ఖర్చు చేయనున్నారు. దీని వల్ల  ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గడంతో పాటు కేంద్రం కూడా నిధులను పెండింగ్​లో ఉంచదని అధికారులు పేర్కొంటున్నారు.