
- రాష్ట్రం వచ్చిన కొత్తలోనే నీళ్ల హక్కు కోల్పోయినం
- ఇయ్యాల ఆర్‌ఎంసీ మీటింగ్
- ప్రతిపాదనలపై సంతకం చేస్తే విద్యుదుత్పత్తికి బోర్డు పర్మిషన్ మస్ట్
- రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ అంటున్న ఇరిగేషన్, జెన్‌కో వర్గాలు
హైదరాబాద్, వెలుగు : ‘‘శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు.. కరెంట్ ఉత్పత్తి కోసమే దానిని నిర్మించారు. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1), ప్లానింగ్ కమిషన్ ఇదే విషయం తేల్చిచెప్పాయి. ఈ ప్రాజెక్టు నుంచి చెన్నై తాగునీటితో కలిపి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ 34 టీఎంసీలకు మించి నీటిని తరలించడానికి వీళ్లేదు’’ ఇన్నాళ్లు తెలంగాణ చేస్తున్న వాదన ఇది. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. శనివారం జరిగిన రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినేలా వ్యవహరించింది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 534 అడుగులే ఉండాలని, అంత వరకు కరెంటు ఉత్పత్తి చేస్తామని ఇన్నాళ్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం... ఆర్‌ఎంసీ మీటింగ్‌లో మాత్రం కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు పెంచడానికి ఒప్పుకుంది. అలాగే శ్రీశైలం కింద తాగు, సాగునీటి అవసరాలు తీరిన తర్వాతే కరెంట్ ఉత్పత్తి చేయాలనే రూల్‌కు ఓకే చెప్పింది. ఈ రికమండేషన్స్‌తో కూడిన రిపోర్ట్‌పై సంతకాలు చేసేందుకు సోమవారం మధ్యాహ్నం ఆర్‌ఎంసీ మీటింగ్ కొనసాగించనున్నారు. ఆ రిపోర్ట్‌పై సంతకం చేస్తే శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి హక్కును వదులుకున్నట్టేనని ఇరిగేషన్, జెన్‌కో వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నీళ్లను ఏపీకి దోచిపెట్టేలా రికమండేషన్స్
శ్రీశైలం నీటిని రాయలసీమకు దోచిపెట్టేలా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించే నీటిని లీగలైజ్ చేసేలా ఆర్‌ఎంసీ రికమండేషన్స్ ఉన్నాయని ఇరిగేషన్, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రాజెక్టులన్నీ నిండి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో ఉపయోగించుకునే నీటిని వినియోగం కింద లెక్కించరాదు అంటే ఏపీకి అప్పనంగా వంద టీఎంసీలకు పైగా కట్టబెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే ప్రతిరోజు 8 టీఎంసీలకు పైగా నీటిని తీసుకునే అవకాశముందని, తెలంగాణ రోజుకు పావు టీఎంసీ కూడా శ్రీశైలం నుంచి మళ్లించుకోలేదని, అలాంటప్పుడు రెండు రాష్ట్రాల వినియోగాన్ని లెక్కల్లోంచి మినహాయించడం అంటే అది తెలంగాణకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందని ప్రశ్నిస్తున్నారు. నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్ విషయంలో అభ్యంతరాలు లేవనెత్తి శ్రీశైలంపై చేతులెత్తేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీ బచావత్ ట్రిబ్యునల్ చేసిన ఎన్ బ్లాక్ కేటాయింపులను ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తామని కేంద్రం ప్రతిపాదిస్తే గుడ్డిగా ఒప్పుకున్నారని, దీంతో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు నీటి వినియోగాన్ని లెక్కల నుంచి మినహాయించడం, బోర్డు అనుమతిస్తే తప్ప కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీళ్లేదు అనే ప్రపోజల్ కు ఒప్పుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
మొదటికే మోసం...
కృష్ణా నీళ్లలో మొదటి నుంచి తెలంగాణకు మోసాలే ఎదురవుతున్నాయని రిటైర్డ్ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తిని చెరిసగం పంచుకోవాలని రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో పెట్టినా.. తెలంగాణ పవర్ హౌస్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి రాష్ట్ర అవసరాల మేరకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే హక్కు ఉందని చెప్తున్నారు. తెలంగాణకు ఎత్తిపోతలు తప్ప గ్రావిటీ ద్వారా ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం లేదని, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే హైడల్ పవర్‌పై హక్కును కోల్పోవడానికి మనంగా సిద్ధపడటం సరికాదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆర్‌ఎంసీ రికమండేషన్స్‌ను తిరస్కరించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి సంతకం చేస్తే కేఆర్‌ఎంబీ మీటింగ్‌లో దానికి ఆమోదం లాంఛనమే అవుతుందని.. మనం వ్యతిరేకించినా బోర్డు చైర్మన్, మెంబర్లతో పాటు ఏపీ సభ్యులను కలుపుకొని వాటిని క్లియర్ చేసుకుంటారని, అప్పుడు మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోకపోతే నీళ్ల వాటాను కోల్పోయినట్టే కరెంట్ ఉత్పత్తి హక్కునూ వదులకోకతప్పదని హెచ్చరిస్తున్నారు.