ఏండ్ల కిందట పేదలకిచ్చిన భూములు లాక్కుంటున్న ప్రభుత్వం

ఏండ్ల కిందట పేదలకిచ్చిన భూములు లాక్కుంటున్న ప్రభుత్వం
  • జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు
  • ఒప్పుకుంటే వెంచర్లు వేశాక ప్లాట్లు ఇస్తామని ఆఫర్లు
  • లేదంటే మొత్తంగా తీసేసుకుంటామని బెదిరింపులు
  • తాజాగా -మహబూబ్‌‌నగర్‌‌‌‌లో హైవే పొంట 470 ఎకరాల్లో జెండాలు పాతిన ఆఫీసర్లు
  • బాధితుల్లో దళితులే ఎక్కువ

మహబూబ్‌‌నగర్ / నెట్‌‌వర్క్, వెలుగు: భూముల వేలంతో వేల కోట్లు రాబట్టుకున్న రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు జిల్లాల్లోని అసైన్డ్‌‌ భూములపై పడింది. గత ప్రభుత్వాలు పేదలకు కేటాయించిన భూములకు ల్యాండ్​ పూలింగ్ పేరిట ఎసరు పెట్టింది. వాటిలో వెంచర్లు వేసి రియల్​ ఎస్టేట్​ వ్యాపారానికి సిద్ధమైంది. తమకు భూములిస్తే ఎకరాకు 400 నుంచి 450 గజాల ప్లాట్లు ఇస్తామని ఆఫీసర్లు ఆశచూపుతున్నారు. వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. తమ ఆఫర్‌‌‌‌కు ఒప్పుకోవాలని, లేదంటే అసైన్డ్​ భూములను వెనక్కి తీసుకునే హక్కు తమకు ఉందని, ఆ తర్వాత ఇంకేమీ మిగలదని హెచ్చరిస్తున్నారు. 
దీంతో  ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు నజర్ పడ్డ అసైన్డ్ భూముల్లో దళితులవే ఎక్కువగా ఉన్నాయి. 
బలవంతపు సేకరణ
ఎలాంటి వివాదాల్లేని అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని ఇటీవలే సర్కారు ప్రకటించింది. కానీ ఇదే సమయంలో ల్యాండ్​పూలింగ్ పేరుతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ అర్బన్​డెవలప్​మెంట్​ అథారిటీలు (యూడీఏలు), మున్సిపాలిటీల పరిధిలోని అసైన్డ్​భూములను బలవంతంగా సేకరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు ఇరువైపులా అన్ని గ్రామాల్లో అసైన్డ్ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెనక్కి తీసుకునే కార్యక్రమం చాపకింద నీరులా సాగుతోంది.

ఆర్ఆర్ఆర్ పరిధిలోని తహసీల్దార్ల నుంచి వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం.. ఆ భూముల్లో వెంచర్లు డెవలప్ చేయాలని, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే ఫార్ములాను  ఇతర సిటీలు, అర్బన్​డెవలప్​మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీల పరిధిలోనూ అమలు చేస్తోంది. సర్కారు జాగలు లేని చోట, తక్కువపడిన చోట ల్యాండ్​పూలింగ్ కింద అసైన్డ్, ప్రైవేట్ భూములను సేకరించి, వెంచర్లు, అవసరమైతే టౌన్​షిప్​లు నిర్మించి అమ్మాలని ఆదేశించింది. పై నుంచి ఒత్తిడి పెరగడంతో కలెక్టర్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్​ప్లానింగ్ ఆఫీసర్లు కొద్దిరోజులు తమ రెగ్యులర్ డ్యూటీలు బంద్​పెట్టి ల్యాండ్​సెర్చింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడ్డారు. ఒకేచోట కనీసం 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే డైరెక్ట్​గా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఏమాత్రం తగ్గినా, అసలు సర్కారు జాగానే లేని చోట్ల మాత్రం అసైన్డ్​ల్యాండ్స్​మీద పడుతున్నారు. ‘‘మీకు మీరుగా ఇస్తే సరి, లేదంటే బలవంతంగా తీసుకోవాల్సి ఉంటుంది” అని బెదిరింపులకు దిగుతున్నారు.
పాలమూరులో సర్వే కలకలం
మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ అర్బన్ డెవలప్​మెంట్ ఆథారిటీ (ముడా) కింద ల్యాండ్​పూలింగ్​కోసం కొద్దిరోజులుగా ఆఫీసర్లు నేషనల్ హైవే 44 వెంబడి భూత్పూర్, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మూసాపేట మండలాల పరిధిలో భూములు సేకరిస్తున్నారు. సరిపడా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో అసైన్డ్​భూములను సర్వే చేస్తున్నారు. ఆయా మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులకు కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎకరా నుంచి రెండు ఎకరాల చొప్పున ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. వారం రోజుల నుంచి జాతీయ రహదారికి మూడు, నాలుగు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో సర్వే చేస్తుండడంతో  స్థానిక రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే ఆయా మండలాల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు అసైన్ చేసిన 470 ఎకరాలను రెవెన్యూ ఆఫీసర్లు గుర్తించి, జెండాలు పాతారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్​ భూములను వాసప్ ఇవ్వాలని, డెవలప్ చేశాక ఎకరాకు 400 గజాల నుంచి 450 గజాల వరకు ప్లాట్లు ఇస్తామని, లేదంటే అది కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. 50 ఏండ్ల కింద ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఎవుసం చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడా భూమిని గుంజుకుంటే ఎట్ల బతకాలని ప్రశ్నిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో అసైనీలకు శాశ్వత హక్కులు
1956 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 13,88,530 మందికి 22,55,617 ఎకరాలను అసైన్డ్ చేశారు. ఇందులో బీసీల వద్ద 8,14,008 ఎకరాలు ఉండగా, ఎస్సీల వద్ద 5,75,497 ఎకరాలు, ఎస్టీల వద్ద 6,72,959 ఎకరాలు, ఓసీల వద్ద 1,46,102 ఎకరాలు, మైనార్టీల వద్ద 54,565 ఎకరాలు ఉన్నట్లు భూరికార్డుల ప్రక్షాళనలో తేలింది. అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం-1977 ప్రకారం మన రాష్ట్రంలో అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్ పొందిన అసైనీలు తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకోవడం తప్ప ఇతరులకు అమ్ముకోవడానికి లేదు. కానీ కర్నాటకలో అసైన్ చేసిన 15 ఏండ్ల తర్వాత, తమిళనాడులో 20 ఏండ్ల తర్వాత, కేరళలో 25 ఏండ్ల తర్వాత, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో 10 ఏండ్ల తర్వాత అర్హతను బట్టి అక్కడి ప్రభుత్వాలు అసైనీలకు భూములపై శాశ్వత హక్కులను కల్పిస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో 50, 60 ఏండ్లయినా అసైన్డ్ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆయా కుటుంబాలకు శాశ్వత హక్కులు దక్కడం లేదు.
అన్నింటికీ అసైన్డ్ భూములే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ సాగునీటి ప్రాజెక్టులు, హైవేలతోపాటు గ్రామాల్లో రైతువేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశానవాటికలు, విలేజ్​పార్కుల పేరిట సుమారు 3 లక్షల ఎకరాల అసైన్డ్​భూములను ప్రభుత్వం సేకరించింది. అసైనీలకు పట్టాదారులతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని గతంలో కోర్టు తీర్పులున్నప్పటికీ చాలాచోట్ల ఆఫీసర్లు దౌర్జన్యంగా లాక్కుంటున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రైతువేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశానవాటికలకు సేకరించిన అసైన్డ్ భూములకు అరకొర పరిహారం ఇవ్వడం, కొన్నిచోట్ల అసలు ఇవ్వకపోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనేక గ్రామాల్లో తమకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆందోళన చేసినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.
చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి..
ఖమ్మం జిల్లాలోని మంచుకొండ, తీర్థాల, కొణిజర్ల, సత్తుపల్లి, సోమవరం రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం అధికారులు గుర్తించారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని రైతులు చెబుతుండగా, నయానో భయానో ఒప్పించేందుకు తహసీల్దార్లు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామంలో సర్వే నంబర్ 133లో దళితులకు 120 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. వీటిని 40 ఏళ్ల క్రితం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో109 మంది పేదలకు పంపిణీ చేశారు. వీటిని ల్యాండ్ పూలింగ్ కింద సేకరించేందుకు రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. మంగళవారం ఆరుట్ల గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయగా, తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటంలోని సర్వే నంబర్లు 252, 268, 269లోని 132 ఎకరాల భూమిని 1975లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఈ భూమిని ఇటీవలే ఆఫీసర్లు పరిశీలించారు. ఈ విషయం తెలుసుకొని ఎస్సీలు ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూమిని వదలుకోమని స్పష్టం చేస్తున్నారు.
మా భూమి పోతే రోడ్డున పడ్తం
సర్వే నంబర్‌‌‌‌ 184లో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. 1977లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా నాన్నకు ఇచ్చిన భూమి అది. ఆయన చనిపోవడంతో నా పేరున విరాసత్ చేసుకున్నా. మాకు ఈ భూమే ఆధారం. ఆఫీసర్లు వచ్చి మా భూమిని తీసుకుంటమని అంటున్నరు. పొలంలో జెండాలు పాతిన్రు. ఈ భూమి పోతే మేం రోడ్డున పడ్తం. ఎకరానికి 400 గజాలు ఇస్తమంటున్నరు. దాన్ని నేనేం చేసుకోవాలె? బలవంతంగా నా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంట.  ‑ బోరింగ్ నర్సింహులు, భూత్పూర్​, మహబూబ్​నగర్​ జిల్లా.
ప్లాటు ఏం చేస్కోవాలె
చానా ఏండ్ల కింద కాంగ్రెస్ సర్కారు ఎకరన్నర భూమి ఇచ్చింది. బోడ్లు, గుట్టలు ఉంటే రూ.3 లక్షల దాన్క కర్సు పెట్టి బావి, పైప్ లైన్ వేసుకొని బాగు చేయించుకున్న. అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్న. నా ముగ్గురు పిల్లలు కూడా ఈ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నరు. ఇప్పుడు భూమి తీసుకొని ప్లాటు ఇస్తామంటున్నారు. దాన్ని నేనేం చేసుకోవాలె - బోడ భద్రు, తీర్థాల, ఖమ్మం రూరల్
ఎట్ల బతకాలె?
నాకు 184 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎకరా ఉంది. ప్రస్తుతం వరి సాగు చేస్తున్నా. కర్వెన రిజర్వాయర్ నీళ్లు వస్తే మూడు పంటలు పండుతాయనుకున్న. ఇప్పుడు మా భూమినే తీసుకోవాలని చూస్తున్నరు. ఉన్న ఎకరం తీసుకుంటే మేమెట్లా బతకాలె? ఏం తినాలె? - రాములు, భూత్పూర్​
భూములిచ్చే ముచ్చటే లేదు
నాకు ఐదెకరాల పొలం ఉంది. మూడు ఎకరాల్లో ఉల్లి, వరి వేసి.. రెండు ఎకరాల్లో మామిడి తోట పెట్టుకున్నా. మాకు ఏ ప్లాట్లు వద్దు. భూములను ఇచ్చే ముచ్చటే లేదు. పొల్లాల్లో పాతిన జెండాలను అందరం కలిసి తీసేస్తాం. 200 మంది రైతులం కలిసి కమిటీ వేసుకున్నాం. భూములు ఇయ్యొద్దని తీర్మానం చేసుకున్నాం. - చంద్రమౌళి, మాజీ జడ్పీటీసీ, షేర్​పల్లి - బి