
- రూ.50 కోట్లతో పనులకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్
- అమ్మవారిని దర్శించుకుని హామీ ఇచ్చిన మంత్రులు
- ఆలయ అభివృద్ధిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
- అన్ని సౌకర్యాలు కల్పిస్తే తీరనున్న భక్తుల కష్టాలు
నిర్మల్, వెలుగు : రాష్ట్రంలో ప్రముఖమైన బాసర సరస్వతీ దేవి ఆలయానికి మంచి రోజులు వచ్చాయి. టెంపుల్ డెవలప్ మెంట్ మాస్టర్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 50 కోట్లు నిధులు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో గత సర్కార్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆలయానికి మహర్దశ పట్టుకుంది. నెల రోజుల కింద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదే సమయంలో ఆలయ సమస్యలు, అభివృద్ధిపై సమీక్షించారు.
ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రూ. 50 కోట్లతో మాస్టర్ ప్లాన్ ద్వారా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) నిధులతో పనులు చేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగానే రెండు రోజుల కింద రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలతో పాటు బాసర సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామంటూ నిర్ణయించింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా అన్నిరకాల వసతి సౌకర్యాలు కల్పించనుంది.
ఇకముందు సరస్వతీ దేవి ఆలయం టెంపుల్ టూరిజం సెంటర్ గానూ మారనుంది. గత నెలలోనే మంత్రి శ్రీధర్ బాబు కూడా బాసర సరస్వతి దేవిని దర్శించుకుని మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు మంత్రుల హామీ కార్యరూపం దాల్చబోతుండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం
గత బీఆర్ఎస్ పాలకులు ఆలయ అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం చేశారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. నిధుల మంజూరులోనూ వివక్ష చూపారు. ఆలయానికి వచ్చే భక్తులను ఎలాంటి ఏర్పాట్లు కల్పించలేదు. తెలంగాణ నుండే కాకుండా ఏపీ, మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సరస్వతీ దేవి దర్శనానికి వేలల్లో భక్తులు బాసరను సందర్శిస్తారు.
ముఖ్యంగా ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యా సాలను చేయించడం సంప్రదాయం. కాగా.. గత సర్కార్ మాస్టర్ ప్లాన్ పై, ఆలయ అభివృద్ధిపైనా పట్టించుకోలేదు. కేవలం వసతి గృహం మాత్రమే నిర్మించింది. సరిపడా నిధులు ఇవ్వకపోగా పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో భక్తులు ఎదుర్కొనే సమస్యలను తీర్చలేకపోయింది.
సరైన వసతులు లేక ఇబ్బందులు
ఆలయాన్ని సందర్శించే భక్తులకు ముఖ్యంగా క్యూలైన్లు, సరిపడా వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి కూడా ఆలయంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది.
భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు గోదావరి నది ఘాట్ల వద్ద కూడా మెరుగైన వసతులు లేకపోవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి రక్షణ సౌకర్యాలు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిలో స్నానాల చేసిన అనంతరం బట్టలు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, టాయిలెట్స్ సరిగా లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది.
టెంపుల్ టూరిజం సెంటర్ గా డెవలప్
మాస్టర్ ప్లాన్ ద్వారా ఆలయాన్ని అభివృద్ధి చేస్తే.. టెంపుల్ టూరిజం సెంటర్ గానూ బాసర మారనుంది. భక్తులకు అన్నిరకాల వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగనుంది. టెంపుల్ కు ఇతర ఆలయాలతోనూ కనెక్టివిటీ ఏర్పడుతుంది.
బాసరకు రైల్వే లైన్ సదుపాయం ఉండడంతో నేషనల్ హైవే కూడా వెళ్తుండడం, మరో నేషనల్ హైవే లింకేజీ ఉండడంతో బాసరకు చేరుకునే భక్తులకు రవాణా సౌకర్యం ఈజీ కానుంది. అంతేకాకుండా సమీపంలోనే నాందేడ్ లో ఎయిర్ పోర్ట్ కూడా ఉండడంతో టెంపుల్ టూరిజం మరింతగా పెరిగే చాన్స్ ఉంటుంది.