
ఖమ్మం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఖరారు చేసిన రిజర్వేషన్లపై గెజిట్ విడుదలైంది. సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు గాను షెడ్యూల్డ్ ఏరియాలో 11 గ్రామపంచాయతీలు పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్ చేశారు.
మరో 99 జీపీలు ఎస్టీలకు, నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 61 జీపీలు, ఎస్సీలకు 110, బీసీలకు 190, అన్ రిజర్వుడు కేటగిరీలో 100 జీపీలు ఉన్నాయి. ఇక జిల్లాలో 20 మండలాలుండగా, ఎంపీపీ పదవుల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు నాలుగు, బీసీలకు 8, అన్ రిజర్వుడ్ కేటగిరీలో మూడు మండలాలున్నాయి. జడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 3, బీసీలకు 8, అన్ రిజర్వుడ్ కేటగిరీలో నాలుగు మండలాలున్నాయి. ఎంపీపీ స్థానాల్లో 9 మహిళలకు కేటాయించగా, జడ్పీటీసీ స్థానాల్లో 10 మహిళలకు రిజర్వు చేశారు. సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్ పదవుల్లో సగం సీట్లు మహిళలకు కేటాయించారు.
471 పంచాయతీల్లో 460 ఎస్టీలకే..
భద్రాద్రికొత్తగూడెం : సర్పంచుల రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ జితేశ్ రిలీజ్ చేశారు. జిల్లాలోన 471 పంచాయతీలున్నాయి. 460పంచాయతీలు ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. ఇందులో 235ఎస్టీ జనరల్, 225 ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ జనరల్2, బీసీ జనరల్ 4, బీసీ మహిళ 2, అన్ రిజర్వ్డు (జనరల్ ) 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
వార్డుల రిజర్వేషన్లు ఇలా..
జిల్లాలో 22 మండలాలకు 4,168పంచాయతీ వార్డులున్నాయి. ఇందులో 1396 వార్డులు ఎస్టీ జనరల్‌గా, 1257 వార్డులు ఎస్టీ మహిళ, 11ఎస్టీ జనరల్‌గా, 7 ఎస్సీ మహిళ, 19బీసీ జనరల్, 23బీసీ మహిళ, 789జనరల్(అన్ రిజర్వ్డు)గా, 666 జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యాయి. జిల్లాలో అతి తక్కువగా 20 గ్రామపంచాయతీ వార్డులు భద్రాచలం పంచాయతీలో ఉన్నాయి. ఇందులో ఐదు ఎస్టీ జనరల్, ఐదు ఎస్టీ మహిళ, ఐదు జనరల్, ఐదు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి.