సర్కారు బడులకు తుట్టెలు కట్టిన బియ్యం

సర్కారు బడులకు తుట్టెలు కట్టిన బియ్యం

పరకాల, వెలుగు: సర్కారు బడులకు తుట్టెలు కట్టిన బియ్యం సరఫరా చేశారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి యూపీఎస్​కు జనవరి కోటా కింద 63 కిలోలకు 50 కిలోల బస్తా, 13 కిలోల బియ్యాన్ని సరఫరా చేశారు. ఆ బియ్యమంతా తుట్టెలు కట్టడంతో ఎంఈవో, తహసీల్దార్​ దృష్టికి తీసుకెళ్లినట్లు టీచర్​సదానందం చెప్పారు. పిల్లలకు ఆ బియ్యం వండిపెట్టలేక చుట్టుపక్కల వారి నుంచి బదులు తెచ్చి మధ్యాహ్న భోజనం వండుతున్నామని చెప్పారు. చుట్టుపక్కలవారు ఇప్పుడు బియ్యం ఇవ్వకపోవడంతో రాయపర్తి స్కూల్​ నుంచి 50 కిలోలు బదులు 
తెచ్చామని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే బియ్యం క్వాలిటీగా ఉండేలా చూడాలని టీచర్లు, గ్రామస్థులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ ​స్కూల్​కు చేరుకుని అధికారుల అలసత్వాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా బియ్యాన్ని వాపస్​ తీసుకుని నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని డిమాండ్​ చేశారు.