- చెరువు మట్టి, పశువుల పెంట వాడకంపై రైతులకు అవగాహన
- సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టిన వ్యవసాయశాఖ
- పంట అవశేషాలను తగలబెట్టకుండా కలియదున్నాలని సూచన
- పచ్చి రొట్ట, నవధాన్యాల సాగుపై విస్తృత ప్రచారం
- నేచురల్ ఫార్మింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులను సహజ సాగు విధానాల వైపు ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సాగు విధానాల్లో భాగమైన ‘ఎన్కటి ఏరువాక’పై రైతుల్లో అవగాహన కల్పిస్తూ పంట పొలాల్లో సేంద్రియ పదార్థాల వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. ఆధునిక వ్యవసాయం పేరుతో రసాయనాల వినియోగం కారణంగా రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు పర్యావరణంపై ప్రభావం పడుతోంది. ఆహార నాణ్యత కూడా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులను సహజ సాగు వైపు మళ్లించి దిగుబడితో పాటు భూసారాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రైతు వారోత్సవాల పేరుతో ఆరు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లోనూ సహజ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే, నేచురల్ ఫార్మింగ్‌లో భాగంగా చెరువుల్లో ఉన్న సారవంతమైన మట్టిని పంట పొలాలకు తరలించేలా రైతులను ప్రోత్సహించనున్నారు. చెరువు మట్టిని పంట పొలాల్లో వేసి కలియదున్నడం ద్వారా నేల సారవంతంగా మారుతుంది. అదేవిధంగా పశువుల పెంట వేయడం, మేకల, గొర్రెల మందలను పంట పొలాల్లో తిప్పడం ద్వారా సహజ ఎరువుల వినియోగాన్ని పెంచాలని రైతులకు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 60 వేల ఎకరాల్లో నేచురల్ఫార్మింగ్ జరుగుతుండగా.. దీనిని మరింత విస్తరించనున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సాగు విస్తరిస్తోంది.
పంట వ్యర్థాలను కలియదున్నాలి..
పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి, మక్క కొయ్యలు, ఇతర సాగు వ్యర్థాలను తగులబెట్టకుండా కలియదున్నాలని రైతులకు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరగడంతో పాటు సూక్ష్మజీవుల సంఖ్య అధికం అవుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. మట్టి పరీక్షల ప్రాధాన్యంపై ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నారు. మట్టిలో ఉన్న పోషకాలు, లోపాలను గుర్తించి దానికి అనుగుణంగా ఎరువుల వినియోగం చేపడితే ఖర్చులు తగ్గడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి రైతు తన పొలానికి సాయిల్ టెస్ట్(భూసార పరీక్ష) చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
పచ్చిరొట్ట విత్తనాలతో గ్రీన్ మెన్యూర్
పచ్చి రొట్ట విత్తనాలతో గ్రీన్ మెన్యూర్ తయారీపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. నవధాన్యాల సాగుపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. జీలుగు, జనుము వంటి పచ్చి రొట్ట ఎరువు పంటలను సాగు చేసి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా సహజసిద్ధంగా భూసారం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రసాయన ఎరువుల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా నవధాన్యాల సాగు, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులపై విస్తృత ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించి సహజ సాగు ప్రయోజనాలను వివరిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పంటల వైవిధ్యం, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై.. సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజీలు, రుణ సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. సహజ వ్యవసాయ విధానాల అమలుతో భూసారం పెరగడంతో పాటు పంటల నాణ్యత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
