
- విధివిధానాలు రూపొందించండి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్
- పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇండ్లు సాధించాలి..- రాజీవ్ స్వగృహ ఇండ్లకు వేలం వేయాలి
- సెక్రటేరియెట్‌లో గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
- ఔట్ సోర్సింగ్‌లో ఇంజినీరింగ్ సిబ్బందిని నియమించాలి
హైదరాబాద్:దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రామ/వార్డు, మండల/పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాలని సూచించారు. బుధవారం సెక్రటేరియెట్‌లో గృహనిర్మాణ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీ క్ష నిర్వహించారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనా (పీఎంఏవై) నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే.. ఈ విషయంలో తెలంగాణ వెనకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇండ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డాటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలపగా.. అవసరమైతే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇండ్లు వేలం వేయాలని తెలిపారు. వాటిని ఏండ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదని, వేలానికి రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా.. వాటిని ఎందుకు అప్పగించలేదని సీఎం ప్రశ్నించారు. అర్హులకు వెంటనే ఆ ఇండ్లను అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్‌లకు మౌలిక వసతులు కల్పించి, వాటిని అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వి.పి.గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల అమలు కోసమే కమిటీలు
ఆరు గ్యారంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే వెల్లడించింది. ఈ మేరకు ఇప్పుడు ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో లేదా వార్డుకు ఒకటి, మండల, పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఒకటి చొప్పున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయన్నారు. ఒక్కో కమిటీలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు సభ్యులు ఉండనున్నారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఆరు గ్యారంటీల్లో భాగమైన ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రూ.500కే సిలిండర్, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం తదితర పథకాలను అర్హులైన పేదలకు అందించేలా చూసే బాధ్యత ఈ కమిటీలకే ప్రభుత్వం అప్పగించనుంది. ఏ పథకానికైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే అర్హుల ఎంపిక జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు కలిపితే ఇందిరమ్మ కమిటీల్లో దాదాపు లక్ష మంది ఉండే అవకాశం ఉన్నది.