
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
రిజర్వేషన్ల విషయంలో ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలని భావిస్తున్నది. విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని ఆ తీర్పు చెప్తున్నదనే అంశాన్ని న్యాయస్థానానికి నివేదించే ఆస్కారం ఉంది.
ఈ అన్నీ అంశాలనూ పొందుపరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అధికారులు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తొలుత న్యాయ నిపుణులతో భేటీ తర్వాత.. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.