17 ప్లాట్లు.. 66 ఎకరాలు .. టీజీఐఐసీ ద్వారా భూముల వేలానికి సర్కారు నిర్ణయం

17 ప్లాట్లు.. 66 ఎకరాలు .. టీజీఐఐసీ ద్వారా భూముల వేలానికి సర్కారు నిర్ణయం
  • రాయదుర్గంలో 4 ప్లాట్లు..20 ఎకరాలు
  • ఉస్మాన్ సాగర్​లో 13 ప్లాట్లు..46 ఎకరాల విక్రయం
  • గరిష్టంగా రాయదుర్గంలో ఎకరా మార్కెట్ వాల్యూ రూ.104 కోట్లు
  • టెండర్లు పిలిచిన టీజీఐఐసీ..ఆగస్ట్ 8 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని పలుచోట్ల భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) ద్వారా విక్రయించనుంది. ఈ మేరకు రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్ లో 13 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించింది. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్స్ లోని 66 ఎకరాల అమ్మకానికి ఇటీవల టీజీఐఐసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్​పిలిచింది. టెండర్ దాఖలుకు ఆగస్టు 8 వరకు గడువు ఇచ్చింది. అదే రోజు టీజీఐఐసీ బోర్డు రూంలో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్ట్ 12 న టెండర్ అవార్డు ఇవ్వనున్నారు. 

అత్యధికంగా 71 కోట్లు.. 

రాయదుర్గంలోని 15A/2 ప్లాట్​కు అత్యధికంగా మార్కెట్ ధర రూ. 71.60 కోట్లుగా ఉన్నట్టు టీజీఐఐసీ పేర్కొంది. అక్కడ కనీస ధరగా (అప్ సెట్ ప్రైస్) రూ. 50.10 కోట్లుగా నిర్ధారించింది. ఇక్కడ 7.67 ఎకరాలను వేలం వేయనున్నారు. ఇక,  అదే రాయదుర్గంలోని ప్లాట్ 19 ధర రూ. 66.30 కోట్లు ఉండగా.. అప్ సెట్ ప్రైస్ ను 44.30 కోట్లుగా నిర్ధారించింది. ఈ పార్సిల్​ లో 11 ఎకరాలను వేలంలో విక్రయించాలని నిర్ణయించారు. కాగా.. రాయదుర్గంలోని 14B/1, 14A/1 ప్లాట్ల మార్కెట్ ధరను చదరపు గజానికి రూ.2,16,405 గా ప్రకటించారు. 

అంటే ఆయా చోట్ల ఎకరం భూమి ధర రూ.104.74 కోట్లు. ఈ రెండు ప్లాట్ల అప్ సెట్ ప్రైస్ ను చదరపు గజానికి రూ.1,51,484 (ఎకరానికి రూ.73.32 కోట్లు)గా పేర్కొన్నారు. మొత్తంగా రాయదుర్గంలో 19.67 ఎకరాలను వేలంలో విక్రయించనున్నారు. ఉస్మాన్ సాగర్ దగ్గర​8, 10 మినహా 1 నుంచి 15 వరకు ప్లాట్ల వేలానికి నిర్ణయించారు. ఇక్కడ మార్కెట్ ధర.. ప్లాట్ ను బట్టి రూ.18.70 కోట్ల నుంచి రూ.25 కోట్లుగా పేర్కొన్నారు.